Jammu Kashmir: జ‌మ్మూకాశ్మీర్ లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌నున్న‌ట్టు నేష‌న‌ల్ కాన్ప‌రెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ (పీడీపీ)లు ప్ర‌క‌టించాయి. పోగొట్టుకున్న మన గౌరవాన్ని తిరిగి పొందేందుకు కలిసికట్టుగా కృషి చేయాలనేది ప్రజల అభీష్టం కాబట్టి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నామ‌ని వెల్ల‌డించాయి.  

Jammu Kashmir elections: జ‌మ్మూకాశ్మీర్ విభ‌జ‌న త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై నిర‌స‌న వ్య‌క్తం అయింది. జ‌మ్మూకాశ్మీర్ లో జ‌ర‌గోయే అసెంబ్లీ ఎన్నిల్లో క‌లిసి పోటీ చేస్తామ‌ని అక్క‌డి రాజ‌కీయ పార్టీలు ముందుకు సాగుతున్న ప‌రిస్థితులున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లు కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి.

సోమ‌వారం నాడు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నేష‌న‌ల్ కాన్పిరెన్స్ ప్రెసిడెంట్, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (PAGD) చైర్మన్ డాక్టర్. ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలె రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిపి పోటీ చేసే విష‌యాన్ని వెల్ల‌డించారు. "మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాము. తాము కూటమి నుంచి తప్పుకున్నట్లు చెప్పిన ఓ రాజకీయ పార్టీ కూడా ఉంది" అని తెలిపారు. “నిజం ఏమిటంటే వారు ఎప్పుడూ కూటమిలో భాగం కాదు. వారు మమ్మల్ని లోపలి నుండి విచ్ఛిన్నం చేయడానికి వచ్చారు” అని తెలిపారు. సజాద్ గని లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ (PC) గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌ మొదట్లో PAGDలో చేరాడు.. కానీ తరువాత సమూహం నుండి వైదొలిగాడు. 

అలాగే, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మీడియ‌తో మాట్లాడుతూ.. జ‌మ్మూకాశ్మీర్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిపి పోటీ చేయ‌నున్న అంశంపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. పోగొట్టుకున్న మన గౌరవాన్ని తిరిగి పొందేందుకు కలిసికట్టుగా కృషి చేయాలనేది ప్రజల అభీష్టం కాబట్టి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాం అని తెలిపారు. ఈ క్ర‌మంలోనే మీడియా జ‌మ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గురించి ప్ర‌శ్నించ‌గా.. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చని అబ్దుల్లా అన్నారు. అలాగే, ప్ర‌స్తుతం కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. యాత్ర శాంతియుతంగా, సజావుగా జరిగేలా కాశ్మీరీలు సంవత్సరాలుగా హామీ ఇస్తూ.. అందుకు స‌హ‌కారం అందిస్తున్నార‌నే విష‌యాలు వెల్ల‌డించారు. 

'హర్ ఘర్ పే తిరంగా' కార్యక్రమం కింద ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అబ్దుల్లాను ప్రశ్నించగా “ప్రభుత్వం ప్రతి ఇంటిపై జెండాను ఎగురవేయవచ్చు, కానీ ప్రజలు వాళ్ళ సొంతంగా జాతీయ జెండాను ఎగురవేస్తే చాలా బాగుంటుంది" అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఆగస్టు 2019లో రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా డౌన్‌గ్రేడ్ చేసిన తర్వాత PAGD ఏర్పడింది. కూటమిలో 5 పార్టీలు ఉన్నాయి. అవి నేష‌న‌ల్ కాన్పిరెన్స్, పిపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్, CPI-M, జ‌మ్మూకాశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్. ఈ కూట‌మి జ‌మ్మూకాశ్మీర్ కు సంబందించి ర‌ద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతోంది. అలాగే, జ‌మ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోద క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తోంది. 

కాగా, జ‌మ్మూకాశ్మీర్ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, పెరుగుతున్న హింస‌ను త‌గ్గించడం, ఈ ప్రాంతం అభివృద్దికి త‌గిన చ‌ర్యలు తీసుకోవ‌డంలో భాగంగా అర్టిక‌ల్ 370 ర‌ద్దుతో పాటు రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇది జ‌రిగిన కొన్ని నెల‌ల వ‌ర‌కు అక్క‌డ ప‌రిస్థితులు ప్ర‌శాంతంగానే ఉన్న‌ట్టు క‌నిపించాయి. కానీ క్ర‌మంలో మ‌ళ్లీ జ‌మ్మూలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకుని ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టం స‌ర్వ‌త్రా ఆందోళ‌న క‌లిగిస్తోంది. అలాగే, ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పుల ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.