West Bengal : సందేశ్‌ఖాలీలో జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ పర్యటన .. శుక్రవారం రాష్ట్రపతి చేతికి నివేదిక
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ ఖాన్ మద్ధతుదారుల హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు గడిచిన కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్లోలిత సందేశ్‌ఖాలీ ప్రాంతంలో జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ పర్యటించింది.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ ఖాన్ మద్ధతుదారుల హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు గడిచిన కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ ఘటనపై జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ (ఎన్‌సీఎస్సీ) ఛైర్మన్ అరుణ్ హల్దార్ స్పందించారు. సందేశ్‌ఖాలీలోని బాధిత మహిళల వాంగ్మూలాన్ని , వారి ఫిర్యాదులు, సమస్యలను ఆలకించిన ఆయన శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో ఎన్‌సీఎస్సీ ప్రతినిధి బృందం పర్యటించింది. సందేశ్‌ఖాలీ ప్రాంతంపై నివేదిక అందుకున్న తర్వాత బాధితుల సమస్యలను వినడానికి కమీషన్ సభ్యులు ఇక్కడికి వచ్చారని అరుణ్ హల్దార్ తెలిపారు.
సందేశ్‌ఖాలీ గురించి తనకు నివేదిక అందిందని.. చాలా మంది ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా అవకాశం లభించలేదని ఆయన పేర్కొన్నారు. కమీషన్ సభ్యులు, తాను స్వయంగా వారి మాటలు వినడానికి ఇక్కడికి వచ్చామని అరుణ్ తెలిపారు. వారి సమస్యలు, ఇబ్బందులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలియజేస్తానని .. తమది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని.. రాజకీయ సంస్థ అని అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ప్రజలను సురక్షితంగా వుంచేందుకు సందేశ్‌ఖాలీలో రాస్ట్రపతి పాలనను అమలు చేయాలని మరో సభ్యురాలు అంజు బాలా డిమాండ్ చేశారు.
సీఎం మమతా బెనర్జీ ఏమీ చెప్పడానికి ఇష్టపడరని.. ఇక్కడి మహిళలపై హింసకు సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్‌లు నమోదు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మిమ్మల్ని క్షమించదని, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా దేశం అడుగుతుందని అంజు వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో రాష్ట్రపతి పాలన విధించాలని.. లేనిపక్షంలో ప్రజలు ఇక్కడ సురక్షితంగా జీవించలేరని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి కాలంలోనూ మహిళలపై ఇలాంటి దారుణాలు జరగడం సిగ్గుచేటని.. రాష్ట్రానికి ఓ మహిళ సీఎంగా వున్నారని అంజు ఎద్దేవా చేశారు. 'ఆమెకు మమత అనే పేరు ఉంది కానీ ఆమె హృదయంలో మమత అనే విషయం లేదంటూ అంజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాలీలో హింసాత్మక ఘటనలపై పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రభుత్వంపై బిజెపి దాడిని కొనసాగిస్తోంది. బిజెపి ఎంపి దిలీప్ ఘోష్ గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. షాజహాన్ షేక్ వంటి తమ నాయకులకు చట్టాన్ని అమలు చేసే సంస్థల నుండి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు ఆమెను క్షమించరు, ఆమె (ఆమె పదవిని) వదిలివేయవలసి ఉంటుంది లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని దిలీప్ ఘోష్ హెచ్చరించారు.
అసలు వివాదం ఏంటీ :
ఉత్తర 24 పరగణాస్ జిల్లా బసిర్‌హత్ సబ్‌డివిజన్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మంగళవారం మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలోని బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ , అతని అనుచరులు తమపై చేసిన దౌర్జన్యాలపై సందేశ్‌ఖాలీలోని మహిళలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జి చేయడంతో మజుందార్‌కు గాయాలయ్యాయి.
హింసాకాండకు సంబంధించి సందేశ్‌ఖాలీని సందర్శించి, అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించేందుకు బిజేపీ.. కేంద్ర మంత్రులు , ఎంపీలతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ కన్వీనర్‌గా కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవిని నియమించారు. ప్యానెల్‌లోని ఇతర సభ్యులు ప్రతిమా భౌమిక్, బీజేపీ ఎంపీలు సునీతా దుగ్గల్, కవితా పటీదార్, సంగీత యాదవ్, బ్రిజ్‌లాల్. ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించి, బాధితులతో మాట్లాడి తమ నివేదికను సమర్పించాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. ఈ ఘటనలు హృదయాన్ని కదిలించేవని జేపీ నడ్డా ఓ ప్రకటనలో అన్నారు. బెంగాల్‌లో మహిళలపై వేధింపులు, పోకిరీ ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని అయితే అక్కడి పరిపాలన మాత్రం మూగ ప్రేక్షకుడిలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి అని జేపీ నడ్డా విమర్శించారు.
మరోవైపు.. షాజహాన్ షేక్ అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న మహిళలు, అత్యాచారానికి గురైన మహిళలు తమపై లైంగిక వేధింపులు జరిగాయని నిరూపించడానికి వైద్య నివేదికను అడిగారని ఆరోపించారు. ఆరు నెలలు లేదా ఏడాది క్రితం జరిగిన కేసులను వైద్య పరీక్షలు, నివేదికల ద్వారా ఎలా రుజువు చేస్తారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమపై అత్యాచారం జరిగినట్లు రుజువు చేసేందుకు మెడికల్ రిపోర్టులు చూపించమని అడుగుతున్నారని.. మహిళలు తమపై అత్యాచారం జరిగిందని ఎలా చెప్పుకుంటారని ఓ నిరసనకారుడు నిలదీశాడు. షాజహాన్, శిబు, ఉత్తమ్, రంజు, సంజు తదితరులను రాష్ట్ర పోలీసులు ఎప్పటికీ అదుపులోకి తీసుకోరని మరో నిరసనకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.