Asianet News TeluguAsianet News Telugu

చౌకీదార్ చోర్ వివాదం: ప్రియాంక గాంధీకి నోటీసులు

చౌకీదార్ చోర్ వివాదం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీనే కాదు ఆయన సోదరి ప్రియాంక గాంధీకి చిక్కులు తెచ్చి పెట్టింది.

National Commission for protection of child rights sends notice to Priyanka Gandhi
Author
New Delhi, First Published May 3, 2019, 1:27 PM IST

న్యూఢిల్లీ: చౌకీదార్ చోర్ వివాదం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీనే కాదు ఆయన సోదరి ప్రియాంక గాంధీకి చిక్కులు తెచ్చి పెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్న పిల్లలు చౌకీదార్ చోర్ అంటూ చేసిన నినాదాలపై జాతీయ బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

 యూపీ రాష్ట్రంలోని తూర్పు భాగానికి ప్రియాంక గాంధీని ఇంచార్జీగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అంతేకాదు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడ ఆమెకు బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ వద్ద సమక్షంలో కొందరు చిన్నారులు చౌకీదార్ చోర్ హై.... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు. అయితే  చౌకీదార్ చోర్ అని నినాదాలు చేయకూడదని ప్రియాంక పిల్లలను వారించారు.

అయితే ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఈ విషయమై ప్రియాంక గాంధీ కూడ స్పందించారు.  బీజేపీ నేతలు  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోను ఎడిట్ చేసి ప్రసారం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు.  పూర్తి వీడియోను కాంగ్రెస్ పార్టీ నేతలు  కూడ విడుదల చేశారు.

ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగానే స్పందించారు. పిల్లలకు కాంగ్రెస్ నేర్పించే భాష ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేశారు.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో చూసిన జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది .

ఎన్‌సీపీఆర్‌సీ ఈ వ్యవహారంలో ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని ఆ నోటీసులు  పేర్కొంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios