జాతీయ అవార్డులు వ‌ల్ల పార్టీలో అంత‌ర్గ‌త వివాదాలు త‌లెత్త‌కూడ‌దని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్ అన్నారు. గులాం నబీ అజాద్ కు పద్మ భూషణ్ అవార్డు రావడం పట్లసొంత పార్టీ నాయకుల నుంచే విమర్శల వచ్చిన నేపథ్యంలో కరణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ కు పద్మభూషణ్ (padma bhushan) అవార్డు రావడం వల్ల ఆయ‌న పార్టీ నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ విష‌యంలో మ‌రో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణ్ సింగ్ (karan singh) స్పందించారు. గులాం న‌బీ అజాద్ కు మ‌ద్దతుగా నిలిచారు. 

గులాం న‌బీ అజాద్ (gulam nabhi azad) కు ప‌ద్మభూష‌ణ్ అవార్డు రావ‌డం ప‌ట్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో కరణ్ సింగ్ (karan singh) కలుగ‌జేకొని నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అజాద్ కు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల ఆయన బహిరంగంగా సమర్థించారు. ‘‘ నా బెస్ట్ ఫ్రెండ్ కు పద్మ అవార్డు పొందడం వల్ల వివాదంలో ప‌డ‌టం న‌న్ను బాధ పెట్టింది.’’ అని అన్నారు. ఈ జాతీయ అవార్డులు వ‌ల్ల పార్టీలో అంత‌ర్గ‌త వివాదాలు త‌లెత్త‌కూడ‌దు. ఇవి పార్టీకి చెందిన అంశాలుగా ప‌రిగణించ‌కూడ‌దని తెలిపారు. ఆజాద్ కఠోరమైన కృషి, అంకితభావంతో రాజకీయ నిచ్చెన‌లో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక సానుకూల, నిర్మాణాత్మక పాత్ర పోషించారని కరణ్ సింగ్ అన్నారు. త‌మలో ఒక‌రికి మంచి గౌర‌వం ల‌భిస్తే అప్యాయంగా అభినందించాలి కానీ, చుల‌క‌న‌గా వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని తెలిపారు. 

కేంద్రంలో ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్ర‌క‌టించ‌డంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొంత కాలం క్రితం అజాద్ జీ - 23 (G-23) బృందానికి నాయ‌క‌త్వం వ‌హించారు. దీంతో ఈ బృందంలోని స‌భ్యుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇక అప్ప‌టి నుంచి సోనియా గాంధీ (Sonia gandhi) కుటుంబ విధేయులకు గులాం న‌బీ అజాద్ టార్గెట్ గా మారారు. 

అజాద్ కు అవార్డు రావ‌డం ప‌ట్ల క‌పిల్ సిబ‌ల్ (kapil sibal) వ్యంగ్యంగా ట్వీట్ (tweet) చేశారు. ‘‘గులాం నబీ ఆజాద్ పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. అభినందనలు భాయిజాన్. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను దేశం గుర్తించింది ఇక‌ కాంగ్రెస్‌కు అతని సేవలు అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ (jairam ramesh) కూడా విమర్శించారు. ‘‘ వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. అయితే ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు. గులాంగా కాదు’’ అని గులాం న‌బీ అజాద్ ను ఉద్దేశించి ట్వీట్ (tweet) చేశారు.

ఈ వివాదానికి కేంద్ర బిందువైన గులాం నబీ అజాద్ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. యూపీఏ (upa) హ‌యాంలో కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఇటీవ‌ల వ‌ర‌కు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్యను రగిలించిన తొలి కాంగ్రెస్ సభ్యులలో ఈయ‌న కూడా ఒక‌రు.