న్యూఢిల్లీ: దేశంలో నలుగురికి ఒకేసారి ఉరిశిక్షను అమలు చేసిన ఘటన ఇవాళే చోటు చేసుకొంది. నిర్భయ కేసులో దోషులుగా ఉన్న పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ లను శుక్రవారం నాడు ఉదయం ఐదున్నరకు తీహార్ జైలులో ఉరి తీశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉరి తీసింది నాథూరామ్ గాడ్సేను. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన కేసులో నాథూరామ్ గాడ్సేను ఉరి తీశారు. 

2015 జూలై 30వ తేదీన ముంబై పేలుళ్ల కేసులో కీలక పాత్ర పోషించిన యాకూబ్ మెమెన్ ను నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. యాకూబ్ మెమెన్ తర్వాత నిర్భయ దోషులను ఉరి తీశారు.

1993లో ముంబై పేలుళ్లలో యాకూబ్ మెమెన్ కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించి ఉరి తీశారు. వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో కీలకపాత్ర పోషించిన అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 8వ తేదీన తీహార్ జైలులో ఉరి తీశారు.

ముంబైలో దారుణ మారణకాండలో కీలక పాత్ర పోషించిన అజ్మల్ కసబ్ 2012 నవంబర్ 12న ఉరి తీశారు. 2008లో ముంబైలో కసబ్ తో పాటు పలువురు పాక్ ఉగ్రవాదులు మారణకాండకు దిగారు.

అయితే ముంబై పోలీసుల దాడిలో మిగిలిన ఉగ్రవాదులు మృతి చెందారు. కసబ్ ఒక్కడే పోలీసులకు ప్రాణాలతో చిక్కాడు. ఎన్ఐఏ అధికారులు విచారణ నిర్వహించారు.

కసబ్ ను విచారించి ముంబై దాడులకు సంబంధించి విచారణ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ ఆధారాలను సేకరించారు.

కోర్టు తీర్పు మేరకు కసబ్ ను 2012 నవంబర్ 12వ తేదీన ఉరి తీశారు. 2004లో మైనర్  బాలికపై అత్యాచారం చేసిన కేసులో ధనుంజయ్ చటర్జీకి మరణశిక్ష విధించారు.


1995 లో ఆటో శంకర్ ను ఉరి తీశారు. వరుస హత్యలకు పాల్పడిన శంకర్ ను కోర్టు తీర్పు మేరకు ఉరి తీశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని హత్య చేసిన కేసులో దోషులు సత్వంత్ సింగ్, ఖేహర్ సింగ్ లకు ఉరి శిక్ష విధించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియాలో ఇప్పటివరకు సుమారు 755 మందికి ఉరి శిక్షను విధించినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.