ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్ 2 ప్రయోగం కొద్దిలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లి చంద్రయాన్ 2 కూలిపోయింది. కాగా... చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్.. విక్రమ్ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది.

ఈ మేరకు చిత్రాలను తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడినట్లు గుర్తించింది. షణ్ముగ సుబ్రహ్మణియన్ అనే వ్యక్తి విక్రమ్ కి సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది. విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750మీటర్ల దూరంలో శకలాన్ని షణ్ముగం గుర్తించినట్లు పేర్కొంది. అనంతరం ఎల్ఆర్శో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను సైతం గుర్తించినట్లు నాసా పేర్కొంది. అక్టోబర్ 14,15 నవంబర్ 11న ఈ చిత్రాలను తీసినట్లు తెలిపింది.

పై చిత్రంలో నీలిరంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వల్ల ప్రభావితమై చంద్రుడి ఉపరితలాన్ని .. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చుక్కలు విక్రమ్ శకలాలన్ని సూచిస్తున్నాయి. ఎస్ తో సూచించిన శకలం షణ్ముగం సుబ్రహ్మణియన్ కనిపెట్టింది.కాగా... విక్రమ్ శకలాలు చంద్రుడి మీద పడటానికి ముందు, తర్వాత చిత్రాలను కూడా నాసా విడుదల చేసింది. 

జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూ కేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాగా... ఇస్రోకి సపోర్ట్ చేయడానికి నాసా కూడా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాసా జరిపిన పరిశోధనలో ఈ విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు తేలింది.