కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చ జరిగిందని గుర్తుచేశారు.

వ్యవసాయంలో సంస్కరణల కోసం చట్టాలు అవసరమన్నారాయన. రైతుల ఆందోళనల్ని తొలగించేందుకు కొన్ని సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా వుందన్నారు.

కేంద్రం చర్చలకు సిద్ధంగా వున్నా.. రైతు సంఘాలు ముందుకు రావడం లేదని తోమర్ వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు చర్చలు జరిగినా ఫలితం రాకపోవడానికి కారణం ఏంటని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని తోమర్ తెలిపారు. తనతో పాటు ప్రధాని మోదీ కూడా రైతులకు కనీస మద్దతు ధరపై రైతులకు భరోసానిస్తున్నామని, ఎంఎస్‌పీ కొనసాగుతుందని నరేంద్ర సింగ్ తోమర్ కుండబద్ధలు కొట్టారు.

మరోవైపు చట్టాల్లో సవరణలు తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాలు ఏకగ్రీవంగా తిరస్కరించాయి. తాము వాటి రద్దు కోరుతుంటే సవరణలు తెస్తామన్న పాత వైఖరినే వినిపించడమేంటని మండిపడ్డాయి.