ప్రజలకు సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించి జాతిని ముందుకు నడిపేవాడే నిజమైన నాయకుడు. కరోనా విపత్తు దేశంపై విరుచుకుపడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మహమ్మారిపై రాజీలేని పోరాటం చేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాన్ని నడిపించడంతో పాటు ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి సత్తా ఏంటీ..? ఏ నేత బాగా పనిచేశారు అన్న దానిపై సీ ఓటర్ సంస్థ ‘‘‘ సీ ఓటర్ సర్వే స్టేట్ ఆఫ్ ది నేషన్’’ పేరుతో ఓ సర్వే చేపట్టింది.

దీనిలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ అత్యుత్తమైన వ్యక్తని 65 శాతం మంది అభిప్రాయపడగా.. బెస్ట్ సీఎం కేటగిరీలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రజలు అగ్రస్థానం కట్టబెట్టారు.

ప్రతి రాష్ట్రం నుంచి 3 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని  ప్రజలు ప్రశంసించారు. మోడీ పనితీరుపై 58.36 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 24.04 శాతం మంది మాత్రం పర్వలేదన్నారు. 16.71  శాతం మంది ప్రధాని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రాల వారీగా ఒడిషా వాసులు ప్రధానికి 95.6 శాతం మార్కులు వేశారు. ఏపీ ప్రజలు 83.6 శాతం, తెలంగాణ వాసులు 71.51 శాతం మార్కులు వేశారు. అయితే తమిళనాడు, కేరళ ప్రజలు మాత్రం ఆయనకు అతి తక్కువ మార్కులు వేశారు.

కరోనాను బాగా డీల్ చేసిన బెస్ట్ సీఎంలలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలవగా.. ఆయనకి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ 81.06 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. బెస్ట్ సీఎంల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాల్గవ స్థానంలో నిలవగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 8వ స్థానం దక్కింది.

ఇక మోడీ సర్కార్ పనితీరును చాలా రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం మార్కులు వేశాయి. అయితే ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీయే బెటర్ అని గోవా, కేరళ, తమిళనాడు ప్రజలు అభిప్రాయపడ్డారు.