Asianet News TeluguAsianet News Telugu

ఆద్యంతం అద్భుతం.. ఛాయ్ వాలా నుంచి ప్రధాని దాకా నరేంద్ర మోడీ లైఫ్ జర్నీ..

ప్రధాని నరేంద్ర మోడీ మరో రెండు రోజుల్లో 72వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన భారత ప్రధానమంత్రిగా అత్యున్నత స్థాయిలో నిలిచారు. 

 

Narendra Modi's life journey from chai wala to Prime Minister..
Author
First Published Sep 15, 2022, 3:44 PM IST

ఆయ‌న ఓ సాధార‌ణ వ్య‌క్తి. కానీ అసాధార‌ణ స్థాయికి ఎదిగారు. సామాన్య కుటుంబంలో పుట్టి, సన్యాసిగా జీవితాన్ని కొన‌సాగిద్దామ‌నుకొని, అనుకోకుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న దేశ అత్యున్న‌త పీఠాన్ని అధిరోహించారు. రైల్వే స్టేష‌న్ లో ఛాయ్ అమ్మిన ఆ వ్య‌క్తి భార‌త ప్ర‌ధానిగా మారారు. పేద‌రికం నుంచి వ‌చ్చిన ఆయ‌న క‌ల‌లో కూడా ఎవ‌రూ ఊహించని ఎత్తులో నిలిచారు. ఆయ‌న లైఫ్ జ‌ర్నీ ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. ఇవ‌న్నీ చ‌దువుతుంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా ఎవ‌రి గురించో.. అవును భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవిత ఘ‌ట్టాల గురించే ఇదంతా.. ఆయ‌న‌ మ‌రో రెండు రోజుల్లో (సెప్టెంబ‌ర్ 17) 72 ఏళ్లలోకి ప్ర‌వేశించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జీవితంలో ఎదిగిన తీరును ప‌రిశీలిద్దాం. 

నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మెహసానా జిల్లా వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అతని తల్లి హీరాబెన్ మోడీ, తండ్రి దామోదరదాస్. మోడీ తన తల్లిదండ్రుల ఆరుగురు సంతానంలో మూడో వ్య‌క్తి. ఆయ‌న త‌న ఎనిమిదేళ్ల వయసులో సంఘ్ (ఆర్ఎస్ఎస్) శాఖలకు వెళ్లడం మొదలుపెట్టారు. అదే స‌మ‌యంలో త‌న తండ్రికి సాయంగా వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో టీ అమ్మడానికి కూడా వెళ్లేవారు. 1967లో 17 సంవత్సరాల వయస్సులో ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత ఆయ‌న ఇంటిని విడిచిపెట్టి, అహ్మదాబాద్ చేరుకుని RSSలో అధికారికంగా సభ్యత్వం తీసుకున్నారు.

అదే స‌మ‌యంలో నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో అనేక మంది సంఘ ప్రచారకులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు మోడీ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. అప్పట్లో సంఘ్ ప్రచారక్ లకు అండర్ గ్రౌండ్ లో ఉంటూ సాయం చేసేవారు. ముప్పై ఏళ్ల వయసులో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ లో డివిజన్ ప్రచారక్ గా మారారు. ప్రచారకర్తగా సంఘ్ ప్రచారంలో చురుగ్గా నిమగ్నమయ్యారు.

1985లో రాజ‌కీయ అవ‌సరాల‌ను దృష్టిలో ఉంచుకుని సంఘ్ ఆయనను బీజేపీలోకి పంపడంతో మోడీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో చేరారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ సోమనాథ్-అయోధ్య రథయాత్ర చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ రథసారథి అయ్యారు. అలాగే 1991లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు బీజేపీ నేత మురళీ మనోహర్‌ జోషి ఏక్తా యాత్రను నిర్వహించడంలో కూడా మోడీ కీలక పాత్ర పోషించారు. దీని వల్ల మోడీ చాలా ఫేమస్ అయ్యారు. 

పెద్ద నాయకులకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, సంస్థ పట్ల విధేయత, అంకితభావాన్ని చూప‌డంతో 1995 సమ‌యంలో బీజేపీలో నరేంద్ర మోడీ స్థాయి పెరిగింది. అనంతరం మోడీ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మూడేళ్ల తర్వాత 1998లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయ‌న అక్టోబర్ 2001 వరకు ఈ పదవిలో కొనసాగారు.

2001లో గుజరాత్‌లో భూకంపం సంభవించినప్పుడు భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 20 వేల మందికి పైగా మరణించారు. ఆ తర్వాత బీజేపీ కేశూభాయ్ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి.. నరేంద్ర మోడీకి అదే ఏడాది అక్టోబ‌ర్ లో సీఎం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయ‌న సీఎం కాకముందు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయ‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

ఆయన అధికారం చేపట్టి ఐదు నెలలే అయిన వెంట‌నే గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు చెలరేగాయి. నివేదికల ప్రకారం గోద్రా అల్లర్లలో రెండు వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గుజరాత్ పర్యటనలో రాజధర్మాన్ని పాటించాలని నరేంద్ర మోడీకి సూచించారు. అప్పట్లో ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించాలనే చర్చ జరిగినా.. ఎల్ కే అద్వానీ మద్దతుతో వాజ్ పేయి నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది.

అల్లర్లు జరిగిన కొన్ని నెలల తర్వాత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల‌లో మోడీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అల్లర్లు ఎక్కువ జ‌రిగిన ప్రాంతాల్లో, దాని ప్ర‌బావం ఎక్కువ‌గా క‌నిపించిన చోట్ల బీజేపీకి ప్ర‌యోజ‌నం ల‌భించ‌డం ఇక్క‌డ విశేషం. దీని తరువాత నరేంద్ర మోడీ గుజరాత్ ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించారు. ఆయ‌న ప్ర‌ధాని అయ్యే వ‌రకు ఆ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎంగా ఉన్నారు. 

సెప్టెంబర్ 2013లో న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో 2014 లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. అప్పుడు అద్వానీతో పాటు మరికొందరు సీనియర్ నేతలు దీనిని వ్యతిరేకించినా.. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ 282 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 26 మే 2014న అనేక పొరుగు దేశాల అధినేతల సమక్షంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో కూడా మోడీ ప్రభంజ‌నం క‌నిపించింది. భారీ మెజారిటీతో ఆయ‌న రెండో సారి అధికారంలోకి వ‌చ్చారు. మ‌రో సారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

చాాలా సాధారణ స్థాయి నుంచి అంత ఎత్తుకు ఎదిగిన ప్ర‌ధాని జీవితం ఎంద‌రికో స్పూర్తిదాయ‌కం. న‌మ్మిన సిద్ధాంత కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే విజ‌యం దానంత‌ట అదే ధ‌రిచేరుతుంద‌ని చెప్ప‌డానికి మోడీయే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. టీ అమ్మిన ఓ కుర్రాడు రెండు సార్లు ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టి దేశాన్ని విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్నారు. ఆయ‌న జీవితం నేటి యువ‌తకు ఎంతో ఆద‌ర్శం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios