మోదీ ప్రభుత్వ పథకాలు: ఈ 10 పథకాలు ప్రత్యేకంగా పేదల కోసమే.. అవేమిటో మీరు తెలుసుకోండి..
ప్రధాని మోదీ ప్రభుత్వం తన 9 సంవత్సరాల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వాటి నుంచి దేశంలోని అనేక మంది సామాన్య ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 73వ పుట్టినరోజు ( ఈ ఏడాది సెప్టెంబర్ 17) సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, సంప్రదాయ నైపుణ్యాల్లో నిమగ్నమైన కార్మికులకు ప్రయోజనం చేకూర్చేందుకు ‘‘పీఎం విశ్వకర్మ యోజన’’ పథకాన్ని తీసుకురానున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశ్వకర్మ జయంతి రోజునే ఆ పథకాన్ని ప్రారంభించారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వం తన 9 సంవత్సరాల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వాటి నుంచి దేశంలోని అనేక మంది సామాన్య ప్రజలు లబ్ధి పొందుతున్నారు.
పీఎం విశ్వకర్మ యోజన పథకం కూడా వాటిలో ఒకటిగా నిలవబోతుంది. సాంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళలతో అనుబంధించబడిన కార్మికులకు ఈ పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన 10 ప్రముఖ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకాలు అన్ని కూడా పేద, ఆర్థికంగా బలహీనమైన ప్రజల కోసం రూపొందించినవే.
పీఎం విశ్వకర్మ యోజన పథకం: మందుగా ఇటీవలే ప్రారంభించిన పీఎం విశ్వకర్మ యోజనతో మొదలుపెడదాం. ఈ పథకం కోసం రూ. 13000 కోట్ల కేటాయించారు. ఇది రాబోయే 5 సంవత్సరాలకు అంటే 2023-2024 నుండి 2027-2028 వరకు వర్తిస్తుంది. 18 సంప్రదాయ క్రాఫ్ట్స్‌ను ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద.. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులు విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు పొందుతారు. అలాగే మొదటి దశలో రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. రెండో దశలో 5 శాతం వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఎలాంటి హామీ అవసరం ఉండదు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన: ఈ పథకం కింద దేశంలోని పేద, నిరాశ్రయులైన ప్రజలు గృహాలను నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ మొత్తం సహాయంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పౌరులు తమ సొంత ఇళ్లు నిర్మించుకోగలుగుతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన(గ్రామీణ ప్రాంతాల కోసం), రెండోవది ప్రధానమంత్రి ఆవాస్ అర్బన్ (ఇది పట్టణ ప్రాంతాల కోసం). ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రూ.1,20,000, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రూ.1,50,000 ఇళ్లు నిర్మించుకునేందుకు అందజేస్తుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్కీమ్‌కు సహకరిస్తున్నాయి. తద్వారా లబ్దిదారులకు రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా ఈ పథకం కింద ఇళ్లు ఇవ్వబడ్డాయి.
జన్ ధన్ యోజన: ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులు బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరవవచ్చు. చెక్ బుక్, పాస్ బుక్, ప్రమాద బీమాతో పాటు జన్ ధన్ బ్యాంక్ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా సామాన్యులకు లభిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కింద జన్ ధన్ ఖాతాదారులు తమ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా రూ. 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం యొక్క లక్ష్యం.. దేశంలోని అత్యంత పేదలను కూడా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన: దేశంలోని చిన్న, చిన్న- సన్నకారు రైతులకు వ్యవసాయంలో ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఏడాదికి రూ. 6, 000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని రూ. 2, 000 చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో లబ్ధిదారుల అర్హత భూమి, ఆదాయ వనరు, కొన్ని ఇతర పారామితులను పరిగణనలోకి తీసుకుంటుంది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన: మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2020 మార్చి ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో.. ఈ పథకం ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేకసార్లు పొడిగించింది. ప్రస్తుతం ఈ పథకం ప్రయోజనాలను 2023 డిసెంబర్ 2023 వరకు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు ప్రతి నెలా 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.
ఉజ్వల యోజన: దేశంలోని మహిళల జీవితాలను మార్చే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం 2016 మేలో ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద బీపీఎల్ కార్డ్ హోల్డర్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడుతుంది. సబ్సిడీపై సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు పొందుతారు. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 2023 మార్చి 1 వరకు ఉజ్వల యోజనలో 9.59 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 2023-24 నుంచి 2025-26 వరకు 3 సంవత్సరాలలో రూ. 1650 కోట్లతో 75 లక్షల కొత్త ఉజ్వల ఎల్‌పీజీ కనెక్షన్‌లను జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం.. విస్తరణ కోసం ఒక ప్రణాళికను కూడా ప్రకటించింది.
ఆయుష్మాన్ భారత్ యోజన: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనమైన పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందుతారు. మందులు, చికిత్స తదితర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకానికి అర్హులైన వ్యక్తులు ఆయుష్మాన్ కార్డు ద్వారా ప్రభుత్వం జాబితా చేసిన ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ పథకాన్ని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ‘‘ఆయుష్మాన్ భవ’’ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. దీని కింద అర్హులైన వ్యక్తుల కోసం ఆయుష్మాన్ కార్డులు తయారు చేయబడుతున్నాయి.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన: ఈ పథకం బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మీరు కేవలం రూ. 436 వార్షిక ప్రీమియం చెల్లించి ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీ కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అయితే గరిష్ట వయస్సు 55 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఖాతాదారుడి ఖాతా నుంచి బీమా ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది. పీఎంజేజేబీవైను కేంద్ర బడ్జెట్ 2015-16 సమయంలో ప్రకటించారు.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన: భారతదేశంలోని అధిక జనాభాను రక్షించే లక్ష్యంతో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇంతకుముందు దీని వార్షిక ప్రీమియం రూ. 12.. అయితే 2022 జూన్ 1 నుంచి దానిని రూ.20కి పెంచారు. ఈ పథకంలో మీకు రూ. 2 లక్షల ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. మీ వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటే.. మీరు సంవత్సరానికి కేవలం రూ. 20 చెల్లించి రూ. 2 లక్షల వరకు కవరేజీని ఇచ్చే ఈ భద్రతా బీమా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు.
అటల్ పెన్షన్ యోజన: ఈ పథకం అసంఘటిత రంగ కార్మికులపై దృష్టి సారించిన భారత పౌరులకు పెన్షన్ పథకం. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పెన్షన్ పథకంలో.. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ మొత్తం మీ పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని ఏ పౌరుడైనా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరవచ్చు. దీని కోసం, అతను పోస్టాఫీస్ / సేవింగ్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. మీ డిపాజిట్ ప్రకారం.. ప్రభుత్వం దానికి కొంత డబ్బును కూడా జోడిస్తుంది. దీని ప్రకారం 60 సంవత్సరాలు నిండిన తర్వాత..ప్రభుత్వం మీకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తుంది.