ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోశయ్య మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రోశయ్య, తాను ఒకేసారి సీఎంలుగా పనిచేశామని గుర్తుచేసుకున్నారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘రోశయ్య మృతి చెందడం బాధాకరం. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు, ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను జరిపిన సంభాషణలను గుర్తుచేసుకున్నాను. ప్రజాసేవలో ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.
సోనియా, రాహుల్.. సంతాపం..
కొణిజేటి రోశయ్య మృతిపట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావును రాహుల్, సోనియాలు ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయింది. ఇక, రేపు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
