Hanuman Chalisa row: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మండిపడ్డారు. శివసేనకు సీఎం పదవి ఆఫర్ చేస్తే.. ఏం ఆలోచించకుండా.. రావణుడి వెంట వెళ్తుందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాలీసాపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో శివసేన సిద్ధాంతాలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మండిపడ్డారు.
Hanuman Chalisa row: మహారాష్ట్రలో ముదురుతున్నహనుమాన్ చాలీసా వివాదంపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే స్పందించారు. శివసేన వ్యవహార తీరుపై మరోసారి మండిపడ్డారు. శివసేన సిద్ధాంతాలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం శివసేనపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ హిందుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు. సీఎం పదవిని ఆఫర్ చేస్తే శివసేన ఏ పార్టీ వెంట అయినా వెళ్తుందని, బిజెపితో పొత్తు నుండి వైదొలగడంపై విరుచుకుపడ్డారు. శివసేన నేతలు ఎవరితోనైనా వెళ్తారు. రావణుడు వచ్చి ఐదేళ్లపాటు సీఎం పదవి ఇస్తే.. శివసేన ఏ పార్టీ వెంట అయినా వెళ్తుందని నారాయణ్ రాణే ఎద్దేవా చేశారు.
డబ్బు, అధికారం ఎక్కడ ఉంటే.. శివసేన అక్కడికి వెళ్తుందని విమర్శించారు. గతంలో మహారాష్ట్రలో బీజేపీ- శివసేన ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం శివసేన.. బీజేపీకి దూరమై.. కాంగ్రెస్, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మరోవైపు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం రాజుకుంటున్నది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా, ఆయన భార్య స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీని సందర్శించి హనుమాన్ చాలీసా పఠిస్తారని ప్రకటించారు. దీంతో వారి ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. శివసేన కార్యకర్తలు రాజకీయ జంట ఇంటికి చేరుకుని, వారిని ఘెరావ్ చేసారు. అయితే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆ జంట తెలిపింది.
కాగా, మతపరమైన శత్రుత్వాన్ని రేకెస్తున్నారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం సాయంత్రం వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ మేరకు విమర్శలు చేశారు. పోలీసులు రాణా దంపతులపై IPC సెక్షన్ 153 (A) (మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మొదలైనవి) కింద కేసు నమోదు చేశారు.బాంద్రా కోర్టు హాలిడే బెంచ్ ముందు ఆదివారంనాడు వీరిని హాజరుపరచనున్నారు.
రానా దంపతుల ప్లాన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని శివసేన నేతలు పేర్కొంటుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నగరానికి వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకూడదని తాము భావిస్తున్నామని రవి రాణా తెలిపారు. ఈ సందర్భంగా రాణా దంపతులు సైతం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు ఆందోళనకు దిగినందున ఉద్ధవ్ థాకరే, శివసేన నేతలు అనిల్ పరబ్, సంజయ్ రౌత్ సహా 700 మందిపై సెక్షన్ 120బి, 143, 147, 148, 149, 452, 307, 153ఎ, 294, 504, 506 కింద కేసులు నమోదు చేయాలని ముంబై పోలీసులకు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. శివసేన కార్యకర్తల నిరసన...దీనికి ముందు, శనివారం ఉదయం ముంబైలోని రాణా దంపతుల ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు.
