నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొడ్డనకుండి సరస్సు తీరంలో పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల కాలంలో ఈ ఫౌండేషన్ మరిన్ని అసోసియేషన్‌లతో కలిసి సరస్సు తీరంలోని చెత్తను ఏరేయడంతోపాటు వాటర్ ఫీడర్స్ పంపిణీ చేశారు.
బెంగళూరు: నమ్మ బెంగళూరు ఫౌండేషన్ దొడ్డనకుండి సరస్సు తీరంలో పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టింది. ఆదర్శ విస్టా రెసిడెంట్స్ అసోసియేషన్, రోటరీ ఈ కనెక్ట్, రోటరీ ఇంటెరాక్ట్‌లతో కలిసి ప్లాగ్ డ్రైవ్‌తోపాటు వాటర్ ఫీడర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేపట్టింది. గత నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం దిగ్విజయం సాగింది. ఈ డ్రైవ్‌లో 50 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. 15 బ్యాగుల చెత్తను కలెక్ట్ చేశారు. 120 కిలోల ప్లాస్టిక్, గ్లాస్ బాటిల్స్‌ను సేకరించి బ్యాగులో చేర్చారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర చెత్త లేకుండా ఈ డ్రైవ్ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓ కార్యకర్త మాట్లాడుతూ, దొడ్డనకుండి సరస్సు తీరంలో తాను 13 ఏళ్లుగా నివసిస్తున్నానని చెప్పారు. రోజు రోజుకు దిగజారిపోతున్న ఈ సరస్సు పరిస్థితులను తాను స్వయంగా చూశానని వివరించారు. ఇప్పుడు నాచు ఆ సరస్సు ఉపరితలాన్ని ఆక్రమించుకుందని తెలిపారు. సరస్సు ఉపరితలంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఈ గ్రీన్ ఆల్గే లేకుండా నీరు కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, 30వ తేదీ ఉదయం జాగింగ్ కోసం వెళ్లిన గుంపు అక్కడ కలుసుకోగానే ఆ సరస్సు దుస్థితి గురించి ఆలోచించారు. వెంటనే కొంత శుభ్రం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. చెత్త సంచులను పంచుకున్నారు. గ్లవ్స్ చేతులకు తొడిగించుకున్నారు. చెత్త ఏరే ప్రతిజ్ఞను తీసుకున్నారు. అందరూ సరస్సు తీరంలో కలియతిరిగారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, పాలిథీన్ కవర్లు, ఇతర బ్యాగులు, డెలివరీ ప్యాకెట్లు, గుట్కా కవర్లు, చాక్లెట్ల రాపర్లు అనేకం కనిపించాయి. వాటన్నింటినీ తమ బ్యాగు
సంచుల్లో వేసుకున్నారు. అందరూ సంతృప్తికరంగా తమ ఇళ్లకు వెనుదిరిగారు.
