Asianet News TeluguAsianet News Telugu

President Droupadi Murmu : తన పేరు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న రాష్ట్రపతి..

భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పేరు ‘ద్రౌపది’ అని మహాభారతంలోని పాత్ర పేరును పోలి ఉండడానికి గల ఆసక్తికర కారణాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు జీవితంలో దు:ఖాల సునామీని చూశానన్నారామె.

Name Was Given By School Teacher: President Droupadi Murmu
Author
Hyderabad, First Published Jul 25, 2022, 2:02 PM IST

భువనేశ్వర్ : భారత మొదటి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన పేరుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశాన్ని గతంలో ఓ వీడియో మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె పేరును, 'మహాభారతం' ఇతిహాసంలోని పాత్ర ఆధారంగా పెట్టిందని.. దానిని తన టీచరే తనకు పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.  ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు అందించారు. జన్మరీత్యా సంతాలీ తెగలో పుట్టిన తన అసలు పేరు ‘పుతి’ అని.. అయితే స్కూల్లో చేరినప్పుడు టీచర్ తన పేరును ద్రౌపదిగా మార్చారని ఆమె వెల్లడించారు.

"ద్రౌపది అనేది నా అసలు పేరు కాదు. ఇది నాకు నా టీచర్ పెట్టిన పేరు.. ఆయన నా స్వస్థలమైన మయూర్‌భంజ్‌కి చెందినవారు కాదు, వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మయూర్‌బంజ్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండేవారు. 1960లలో ఇక్కడి స్కూల్స్ లో పనిచేసే టీచర్లు బాలాసోర్ లేదా కటక్ నుండి ఇక్కడికి వచ్చేవారని ఆమె పేర్కొన్నారు.

'మహాభారతం'లోని ప్రముఖ పాత్ర పేరుకు ఆమె పేరుకు ఏదైనా సంబంధం ఉందా అని.. విలేఖరి అడిగినప్పుడు, "మా టీచర్ కు నా అసలు పేరు నచ్చలేదు. దీంతో ఆయన నా పేరును మార్చారు. అది నాకు మంచే చేసింది’ అని ఆమె చెప్పారు. అంతేకాదు తన పేరు ఆ ఒక్కసారే కాదు చాలాసార్లు మార్చారని చెప్పుకొచ్చారు. ద్రౌపది అని పలకరాకనో.. అర్థం తెలియకనో.. కారణమేంటో కానీ తన పేరు “దూర్పడి” నుండి “దోర్పిడి”ఇలా చాలా రకాలుగా మార్చేవారని అన్నారు.

సంతాలీ సంస్కృతిలో పేర్లు చచ్చిపోవడం.. అంటే మరుగున పడిపోవడం ఉండవని ఆమె పేర్కొన్నారు. "ఒక ఆడపిల్ల పుడితే, ఆమెకు తన అమ్మమ్మ పేరు పెడతారు. కొడుకు పుడితే తాత పేరును పెట్టేస్తారు. అలా పేరు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది’ అని ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చారు. స్కూల్, కాలేజీల్లో ద్రౌపది ముర్ము ఇంటిపేరు ‘తుడు’ అని ఉండేది. ఆ తరువాత ఆమె బ్యాంక్ అధికారి అయిన శ్యామ్ చరణ్ తుడుని వివాహం చేసుకున్నాక.. తన పేరును ద్రౌపది ముర్ముగా మార్చుకున్నారు. 

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన ముర్ము రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్‌పై ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. 

అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ.. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము..

''పురుషులు ఆధిపత్యం వహించే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి. రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎన్నుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు పంపిణీ చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చు”అని ఆమె ఒక పత్రిక ఇంటర్వూలో చెప్పారు. అయితే, ద్రౌపది ముర్ము, మహిళలు "గుణాత్మక రాజకీయాల"పై దృష్టి పెట్టాలని, పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీలలో సాధికారత కోసం తమ గళాన్ని వినిపించాలని అన్నారు. "మహిళలు సరైన ఫోరమ్‌లలో ప్రజల సమస్యలను హైలైట్ చేయడం ద్వారా వారి గుణాత్మక చతురతను బలోపేతం చేసుకోవాలి" అని ఆమె చెప్పింది.

ఫిబ్రవరి 18, 2020న బ్రహ్మకుమారి గాడ్లీవుడ్ స్టూడియోకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో, ముర్ము తన పెద్ద కుమారుడు లక్ష్మణ్ 25 ఏళ్ల వయసులో మరణించడం తనను ఎంతో కృంగదీసిందని చెప్పుకొచ్చారు.  "నా కొడుకు మరణంతో నేను పూర్తిగా కృంగిపోయాను. దాదాపు రెండు నెలలు డిప్రెషన్‌లో ఉన్నాను. ప్రజలను కలవడం మానేసి ఇంటికే పరిమితమయ్యాను. తరువాత నేను ఈశ్వరీయ ప్రజాపతి బ్రహ్మకుమారిలో చేరాను, యోగా, ధ్యానం చేశాను”అని చెప్పుకొచ్చారు.  

15వ రాష్ట్రపతి ముర్ము జీవితంలో పెద్ద కొడుకు మరణంతో విషాదాలు ఆగలేదు.  2013లో రోడ్డు ప్రమాదంలో తన చిన్న కుమారుడు సిపున్‌ను కోల్పోయారు. ఆ తర్వాత ఆమె సోదరుడు, తల్లి మరణించారు. ఇలా ‘ఒకరి తర్వాత ఒకరి మరణాలతో నా జీవితంలో సునామీని ఎదుర్కొన్నాను. ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణాలను చూశాను" అని ప్రెసిడెంట్ ముర్ము చెప్పారు, ఆమె భర్త శ్యామ్ చరణ్ కూడా అనారోగ్యంతో 2014 లో మరణించారు.

"ఒకానొక సందర్భంలో.. నేను ఏ క్షణంలోనైనా చనిపోతానేమో..’ అనుకున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇవి చెబుతూ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం ఎంత స్థాయిలో ఉండాలని కోరుకుంటామో.. దుఃఖం కూడా అదే స్తాయిలో ఉంటుంది. దాన్ని స్వీకరించాలి అంతే అంటూ చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios