Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో ప్రత్యేకంగా నమాజ్ రూమ్.. ‘హరే రామా’ నినాదాలతో బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనలు

జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేకంగా నమాజ్ చేసుకునే గదిని కేటాయిస్తూ స్పీకర్ రవీంద్ర నాత్ మహతో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఆందోళనలు చేస్తున్నారు. లేదా అసెంబ్లీ ప్రాంగణంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలని, ఇతర మతస్తుల ప్రార్థనాలయాలనూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 

namaz room allotted in jharkhand assembly, bjp mlas protesting against it
Author
Ranchi, First Published Sep 6, 2021, 2:01 PM IST

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో నమాజ్ చేయడానికి ప్రత్యేకంగా గదిని కేటాయించారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీ చర్చలను దాదాపు నిలిపేసినంత పనిచేస్తున్నారు. సోమవారం అసెంబ్లీ చర్చలు ప్రారంభానికి ముందే ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశం దగ్గరున్న మెట్లపై కూర్చుని ప్రదర్శన చేశారు. హనుమాన్ చాలీసాను పఠిస్తూ ‘హరే రామా’ నినాదాలు చేశారు. ‘హరే రామా’ ప్లకార్డులతో నిరసన చేశారు.

అసెంబ్లీ సమావేశం ప్రారంభమవగానే బీజేపీ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలతో అసెంబ్లీలోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా నమాజ్ రూమ్ కేటాయించడాన్ని వారు తప్పుపట్టారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ రవీంద్ర నాత్ మహతో ఆందోళన చేస్తున్న బీజేపీ సభ్యులను తమ తమ సీట్లలో కూర్చోవాల్సిందిగా అభ్యర్థించారు. ‘మీ సీట్లలో కూర్చోండి. మీరు సత్ప్రవర్తన కలిగిన సభ్యులు. దయచేసి సహకరించండి’ అని అన్నారు.

అయినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. దీంతో సభను 12.45 గంటల వరకు వాయిదా వేశారు. ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా నమాజ్ గదిని అసెంబ్లీలో కేటాయించే నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే సీఎం హేమంత్ సోరెన్, స్పీకర్ రవీంద్ర నాత్ మహతోల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

రూమ్ నెంబర్ టీడబ్ల్యూ 348ను నమాజ్ చదువుకోవడానికి కేటాయిస్తూ స్పీకర్ రవీంద్ర నాత్ మహతో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు అసెంబ్లీ ప్రాంగణంలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలని, ఇతర మతస్తుల ప్రార్థనాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios