తండ్రి సెల్ఫీ పిచ్చి కారణంగా.. నాలుగేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం నమక్కల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాబు, సోఫియా దంపతులకు ధన్వంత్(4) అనే కుమారుడు ఉన్నాడు. వీరు కరూర్ లోని ఎల్ పీజీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ధన్వంత్ కారూర్ లోని ఓ స్కూల్ లో కిండర్ గార్డెన్ చదువుతున్నాడు. 

మంగళవారం ఉదయం బాబు.. తన నాలుగేళ్ల కుమారుడు ధన్వంత్ తో కలిసి కారులో మోహనూర్ నుంచి వంగల్ జిల్లాకు కావేరీ నదిపైగల బ్రిడ్జిపై వెళుతున్నాడు. ఆ సమయంలో బ్రిడ్జి మధ్యలో ఆగి.. 24వ పిల్లర్ వద్ద సెల్ఫీ దిగాలని భావించారు. బాబు.. ఒక చేతిలో తన కుమారుడిని పట్టుకొని.. మరో చేతితో ఫోన్ సహాయంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కాగా.. ఆ సమయంలో.. పట్టుదప్పి.. అతని చేతిలోని కుమారుడు నీటిలో పడిపోయాడు. 

ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు నీటిలో కొట్టుకుపోయాడు. రెండు రోజుల క్రితమే కావేరీ నదిలోని రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసినట్లు సమాచారం. ఆ నీటిలో బాలుడు కొట్టుకుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుడి శవం కూడా దొరకకపోవడం గమనార్హం.

బాలుడు తండ్రి బాబుని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ముందు రోజే బాలుడి నాలుగు సంవత్సరాలు నిండి ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టాడని బంధువులు తెలిపారు. బాలుడి మృతితో అతని తల్లి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.