తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌పై అభ్యంతరమైన వార్త ప్రచురించారన్న ఆరోపణలపై ప్రముఖ తమిళ వీక్లీ ‘‘నక్కీరన్’’ ఎడిటర్ ఆర్ ఆర్ గోపాల‌్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు

తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌పై అభ్యంతరమైన వార్త ప్రచురించారన్న ఆరోపణలపై ప్రముఖ తమిళ వీక్లీ ‘‘నక్కీరన్’’ ఎడిటర్ ఆర్ ఆర్ గోపాల‌్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌భవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో గోపాల్‌ను అరెస్ట్ చేశారు.

గవర్నర్ పురోహిత్‌ను కలిసినట్లు నిర్మలాదేవి అంగీకరించారని.. అలాగే గవర్నర్ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిని కొంతమంది విద్యార్థినులు కలిశారని.. అందుకే గవర్నర్ ఈ కేసుపై విచారణకు అంగీకరించడం లేదంటూ ‘‘ నక్కీరన్’’లో కథనాలు వచ్చాయి.

గవర్నర్ పురోహిత్‌పై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు.. రాజ్‌భవన్ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా అభ్యంతరకర కథనాన్ని ప్రచురించినందుకు గాను గోపాలన్‌పై గవర్నర్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం చెన్నై నుంచి పుణె వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన గోపాల్‌ను ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు ఎనిమిది మంది ఇన్స్‌పెక్టర్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై గవర్నర్ స్పందించారు. ప్రొఫెసర్ నిర్మలాదేవీని తాను ఎన్నడూ కలవలేదన్నారు. కేసు విచారణ నిమిత్తం ఒక రిటైర్డ్ ఉన్నతాధికారిని నియమించారు. 

పరీక్షాల్లో మంచి మార్కులతో పాటు.. బంగారు భవిష్యత్ కావాలనుకునే విద్యార్థునులు తాను చెప్పినట్లుగా వినాలని.. ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలని చెప్పిన విరుద్‌నగర్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి మాట్లాడినట్లుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేప్ తమిళనాట సంచలనం కలిగించింది. ఈ కేసుకు సంబంధించి నిర్మలాదేవీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.