చక్రం తిప్పిన కుష్బు.. నగ్మా ఔట్

First Published 6, Jun 2018, 9:59 AM IST
Nagma removed from political post suddenly
Highlights

నగ్మాకి షాక్ ఇచ్చిన కుష్బు

అలనాటి అందాల తార, కాంగ్రెస్ మహిళా నేత నగ్మాకి షాక్ తగిలింది. తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం నగ్మాను తప్పించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. 

జాతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నగ్మాను ఈ బాధ్యతల నుంచి తప్పించడంలో పార్టీ అధికార ప్రతినిధి కుష్బు ప్రమేయం ఉండొచ్చని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ గురించి ఏమైనా చెప్పుకోవాలంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది వర్గ పోరు మాత్రమే. ఆనాటి కామరాజనాడార్‌ మొదలు ఈనాటి తిరునావుక్కరసర్‌ వరకు వర్గపోరును భరించినవారే. 

ఒకరినొకరు బహిరంగా విమర్శించడంలో ఎవరికి వారే సాటిగా వ్యవహరిస్తుంటారు. తమిళనాడు కాంగ్రెస్‌లో తిరునావుక్కరసర్, ఈవీకేఎస్‌ ఇళంగోవన్,  పి.చిదంబరం వర్గాలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.

ఇక ప్రస్తుత విషయానికి నగ్మా, కుష్బు ఇద్దరూ బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు దిగుమతైన నటీమణులే. కానీ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో ఒకరంటే ఒకరికి పట్టనట్లుగా వ్యవహరిస్తారు. నగ్మా కార్యక్రమాలకు కుష్బు హాజరైన సందర్భాలు లేవు. 

ఇద్దరికీ కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే కుష్బు తమిళం చక్కగా మాట్లాడతారు. నగ్మాకు తమిళం రాదు. కుష్బులా నగ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఝాన్సీరాణిని లెక్కచేయడం లేదనే విమర్శ ఉంది. 

ఇటీవల ఒక సమావేశంలో ఝాన్సీరాణిని దూరంగా కూర్చోవాలని నగ్మా ఆదేశించడం కలకలం రేపింది. నగ్మాను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.  ఈ ఫిర్యాదుల ఫలితమే నగ్మాకు ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి ఉద్వాసనగా తెలుస్తోంది.

loader