Nagaland Firing: ఆర్మీ యూనిట్‌పై కేసు.. ‘హత్య చేయాలనే ఉద్దేశంతోనే..’ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు..

భారత సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌పై (21 Para Special forces of Army) నాగాలాండ్ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఆర్మీ యూనిట్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలను ప్రస్తావించారు.

nagaland firing On Police File FIR Against 21 Para Special forces of Army alleges Intention To Murder

నాగాలాండ్‌లో జరిగిన కాల్పుల (Nagaland Firing) ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అమాయక ప్రజల ప్రాణాలను తీసిన భద్రతా బలగాల మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌కు సంబంధించి పోలీసులు.. భారత సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌పై (21 Para Special forces of Army) సుమోటోగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. అంతేకాకుండా ఎఫ్‌ఆర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. భద్రతా దళాల ఉద్దేశం.. పౌరులను హత్య చేయడం, గాయపరచడం అని అందులో ఆరోపించారు. ‘ఈ ఘటన జరిగిన సమయంలో భద్రత బలగాలు ఆపరేషన్ కోసం పోలీసు గైడ్‌ను అందించమని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించలేదనే విషయాన్ని గమనించాలి. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యం చేయడం, గాయపరచడం అని స్పష్టంగా తెలుస్తోంది’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

‘శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బొగ్గు గని కూలీలు (coal mine labourers) తిరు నుంచి బొలెరో వాహనంలో వారి స్వగ్రామమైన ఒటింగ్‌కు బయలుదేరారు. వారు అప్పర్ తిరు- ఒటింగ్ గ్రామం మధ్య ఉన్న లాంగ్‌ఖావో (Longkhao) వద్దకు చేరుకన్నప్పుడు భద్రతా బలగాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వాహనంపై నిర్దాక్షిణంగా కాల్పులు జరిపారు. ఫలితంగా చాలా మంది ఒటింగ్ గ్రామస్తులు మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. 

అసలేం జరిగిందంటే..?
నాగాలాండ్ మోన్‌ జిల్లాలోని తిరు బొగ్గు గని-ఒటింగ్‌ (Oting) గ్రామాల మధ్య భద్రతా బలగాల మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. అయితే ఒటింగ్ గ్రామానికి తిరిగివస్తున్న బొగ్గు గని కార్మికులు వాహనంపై బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో అందులో ఉన్నవారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అయితే బొగ్గు గని కార్మికుల వాహనంలో ఎలాంటి ఆయుధాలు గానీ, మందుగుండు సామాగ్రి గానీ లభించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

అయితే ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహం చెందారు. వందలాది మంది గ్రామస్తులు, యువత.. రెండు మిలటరీ వ్యాన్లకు నిప్పు పెట్టారు. సైనికులు, అసోం రైఫిల్స్‌ జవాన్లు, భద్రతాబలగాలపై రాళ్లతో, ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాన్ చనిపోగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. అయితే పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో భద్రతా బలగాలు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాయి. ఇందులో కనీసం ఐదుగురు మరణించారు. పలువురు గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనలో మరణించిన 13 మంది అమాయక ప్రజల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టుగా నాగాలాండ్ ప్రభుత్వం తెలిపింది. 

ఈ ఘటనపై స్పందించిన ఇండియన్ ఆర్మీ (Indian Army).. భద్రతా బలగాల ఆపరేషన్‌లో దురదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరిగినందుకు తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. తిరుగుబాటుదారుల కదలికలపై సూచన మేరకు.. తిరు-ఒటింగ్ రహదారిపై ఆకస్మిక దాడికి ప్లాన్ చేసినట్లు సైన్యం తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios