దేశం ఒకవైపు అభివృద్ధి వెంట పరగులు తీస్తుంటే... మరోవైపు ఇప్పటికీ కులాలు, కట్టుబాట్లు పేరిట అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇలాంటి మరో సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుడికి సమీపంలో సేద తీరాడనే కారణంతో ప్రతాప్ అనే ఓ దళితుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు.  ఆ యువకుడిని నగ్నంగా మార్చేశారు. అనంతరం కొబ్బరి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు.  ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మద్రాహళి ప్రాంతంలో చోటుచేసుకుంది.

కాగా.... దళితుడు అనే కారణంతో ప్రతాప్ అనే యువకుడి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని అతని కుటుంబసభ్యులు తప్పుపట్టారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ...  యువకుడి కుటుంబసభ్యులు, బంధువులు అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు.

ప్రతాప్ బంధువులు మాట్లాడుతూ.... గత కొంతకాలంగా ప్రతాప్  మతిస్థిమితం సరిగా లేదు. కాగా... ఇటీవల ఇంట్టో నుంచి పరారైన అతను ఓ గుడికి సమీపంలో నిద్రిస్తున్నాడు. అతను గుడిలోకి అడుగుపెట్టడంతో... ఆలయం అపవిత్రం అయ్యిందంటూ ఆ గుడి పూజారాి నానా హంగామా చేశారు. ఈ విషయం మరికొందరికి తెలియజేయడంతో వారంతా కలిసి... అతని శరీరంపై దుస్తులను తొలగించారు. అనంతరం చెట్టుకు కట్టేసి దాడి చేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టు  చేయడం గమనార్హం.

ప్రతాప్ బంధువుల ఆందోళనతో పోలీసులు దిగి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.