తమిళనాడులో త్వరలో 20 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.  


తమిళనాడులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో త్వరలో 20 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయం పరిశీలిస్తానని, కాకుంటే డీఎంకే నుంచి కాంగ్రెస్‌ విడిపోతేనే అది సాధ్యమని కమల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్‌, డీఎంకేల పొత్తు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు కమల్‌హాసన్‌ ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని కొత్తగా తీర్చిదిద్దాల్సిన శిల్పులు ప్రజలేనని పేర్కొన్నారు. వారు డబ్బు కోసం ఓట్లు వేయరని తెలిపారు. విలువైన ఓటును అనాలోచితంగా వేసి ఐదేళ్లు రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టకూడదని కోరారు. తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలు కోరికలు తీర్చేందుకు వీలవుతుందని, కావున ప్రజలను నమ్మి ఎంఎన్‌ఎం పోటీ చేస్తుందని తెలిపారు. 

తాను సినిమాలో సంపాదించిన పేరును నమ్మి పార్టీ ప్రారంభించలేదన్నారు. ప్రజలను నమ్మి వచ్చానని తెలిపారు. వెళ్లే చోటల్లా ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని, వారి కోరికలు నెరవేర్చాలంటే ఓటు హక్కు వినియోగించుకుని ఎంఎన్‌ఎంను గెలిపించాలని కోరారు.