ఛత్తీస్‌గడ్‌లో దారుణం జరిగింది. తాను పీకల్లోతు ఇష్టపడ్డ యువతికి పెళ్లి కుదిరిందని, త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నదని తెలుసుకుని తనలో తానే చిత్రవధ అనుభవించాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణానికి ముందు తన గదిలో ఆయన రాసిన వ్యాఖ్య ఆ యువకుడి ఆవేదనను వెల్లడిస్తున్నది. 

రాయ్‌పూర్: పెళ్లి పీటలకు ఎక్కడానికి సిద్ధం అవుతున్న యువతితో ఆ యువకుడు వన్ సైడ్ లవ్‌‌లో ఉన్నాడు. తన ప్రేమను ఆ అమ్మాయి ఫీల్ అయితే చాలు అనుకునేంత లవ్. ఆమె నుంచి తిరిగి ఆశించని నిస్వార్థ ప్రేమ. ఆమెను విడిచి భవిష్యత్‌ను ఊహించలేని ప్రేమపిచ్చి. ఆ పిచ్చితనమే యువకుడి ప్రాణాలు తీసింది. పీకల్లోతు ఇష్టపడిన అమ్మాయి పెళ్లికి బాజా బజంత్రీలు మోగించడానికి సిద్ధం చేస్తున్నారు. పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుసుకున్నాడు. ఆ వేదన మనసును లావాలాగే దహించివేసింది. తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. చివరికి ఇక జీవించి లాభం లేదని, చనిపోవాలనే తప్పు నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆ గదిలో ఉరికి సిద్ధం చేసుకున్నాడు. ఆ గది గోడపై ‘ప్రియతమా! నా చావే నేను నీకు ఇచ్చే నీ పెళ్లి కానుక. ఐ లవ్ యూ’ అని బొగ్గుతో రాశాడు. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని బలోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంటిలో ఉరి తాడును సిద్ధం చేస్తూ ఆ యువకుడు వీడియో తీశాడు. ఆ ఉరితాడును తన మెడకు బిగించుకునే వరకు వీడియో తీశాడు. ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. ఉరితాడుకు వేలాడి ప్రాణాలు విడిచాడు.

బలోడ్ డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది మాట్లాడుతూ, ఆ యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారని వివరించారు. ఆ యువకుడు వాట్సాప్ స్టేటస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోనూ పరిశీలిస్తామని తెలిపారు. ఒక్కసారి అన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.

గుంటూరులో ఇదే నెలలో ఓ విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో ఓ భార్యభర్త చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వారిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు సంతానభాగ్యం లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఇన్నేళ్ళు జీవించారు. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం బారిన పడిన భర్త మృతి చెందితే.. దాన్ని జీర్ణించుకోలేని భార్య కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేని ఆ వృద్ద దంపతులకు ఒకరి తర్వాత మరొకరికి పక్కపక్కనే చితి పేర్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు.

ఈ విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నావారి తోటకు చెందిన దంపతులు మణుగూరు వెంకటరమణారావు (68), సువర్ణ రంగలక్ష్మి (65)లకు పిల్లలు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న రమణరావును ఈనెల 19న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది భార్య. అయితే, అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో.. మరుసటిరోజు అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో భార్యకు ఏం చేయాలో పాలు పోలేదు. ప్రపంచంలో ఒంటరిగా అయిపోయానన్న భావన ఆమెను చుట్టుముట్టింది. ఇంక తను ఎవరికోసం బతకాలో తెలియలేదు. పిల్లలు లేకపోవడం, భర్త మృతి చెందాడనే మనోవేదనతో బతుకు భారం అవుతుందని భావించి తన సోదరి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని రంగ లక్ష్మి సోదరుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని నగరపాలెం సిఐ హైమారావు తెలిపారు.