ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్ నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమితులైన సుష్మాస్వరాజ్ కు అభినందనలు కూడా చెప్పేస్తున్నారు. 

ఈ వ్యవహారం కాస్త సుష్మాస్వరాజ్ దృష్టికి వెళ్లింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె తాను ఏపీకి గవర్నర్ గా నియామకం కానున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అవన్నీ అవాస్తవమంటూ తన అధికారిక ట్విట్టర్ లో స్పష్టం చేశారు. 

ఇకపోతే ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరిగింది. 

ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేత వస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుష్మాస్వారాజ్ స్పందించాల్సి వచ్చింది. గవర్నర్ గా తన నియామకం వట్టిదేనని తేల్చిపారేశారు.