సివిల్స్ కోసం పదేళ్లు శ్రమించి సాధించలేకపోయిన ఓ యువకుడు తన ఆవేదనను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆరు సార్లు సివిల్స్ కోసం ప్రయత్నించినా సాధించలేకపోయానని పేర్కొన్నాడు. అయితే.. తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తానని తెలిపాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: సోమవారం సివిల్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు వెలువడగానే అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. విజేతలను ఆకాశానికెత్తారు. సోషల్ మీడియాలోనూ సివిల్స్ రిజల్ట్స్ బజ్ కొనసాగింది. అయితే, ఎప్పుడూ విజేతల విషయాలేనా? అప్పుడప్పుడు పరాజయుల గాథ కూడా వినాలి అని కొంత మంది చెబుతుంటారు. విజయం సాధించడానికి ముందటి శ్రమనూ చూడాలని, హార్డ్ వర్క్ చేసి ఫలితం సాధించని పరాజితుల స్టోరీని ఓ కంట కనిపెడుతుండాలని కొందరు సూచిస్తుంటారు. అయితే, సివిల్స్ ఫలితాల విషయంలో ఓ యాస్పిరెంట్ మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు.
ఏళ్ల తరబడి కఠోరంగా శ్రమించి సివిల్స్ సాధించకుంటే వారు పడే వేదన అంతా ఇంతా కాదు. కొందరైతే మానసికంగా కుంగిపోతారు. మనస్తాపం చెందుతారు. మళ్లీ ఆ ఫలితాల నుంచి తేరుకోడానికి కొందరికి నెలల తరబడి కాలం పడుతుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ సివిల్ యాస్పిరెంట్ మాత్రం డేరింగ్‌గా తన సివిల్స్ సమరాన్ని, అందులో వైఫల్యాన్ని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.
జమ్ము కశ్మీర్‌కు చెందిన రజత్ సంబ్యాల్ అక్కడే పుట్టి పెరిగాడు. చండీగడ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పదేళ్లుగా సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా కూడా ఈ సివిల్స్‌కు ప్రయత్నించి విఫలం అయ్యాడు.
రజత్ సంబ్యాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆయన ఈ విధంగా రాసుకొచ్చాడు. తన పదేళ్ల హార్డ్ వర్క్ బూడిదలో కలిసిందని పేర్కొన్నాడు. యూపీఎస్‌సీ కోసం ఆరు సార్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని వివరించాడు. అందులో మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొన్నాడు. రెండు సార్లు మెయిన్స్ ఫెయిల్ అయినట్టు వివరించాడు. ఇక తన చివరి అటెంప్ట్ కూడా ఫెయిల్ అయినట్టు పేర్కొన్నాడు. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్‌తోనూ తన చివరి ప్రయత్తం కూడా వృథా అయిందని తెలిపాడు. 11 మార్కుల దూరంలో తన సివిల్స్ కల చెదిరిపోయిందని వివరించాడు. అయితే ఏం.. తాను మళ్లీ పైకి ఎగురుతా అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ట్వీట్‌ను ముగించాడు. తన మార్కుల టేబుల్‌ను, యూపీఎస్సీ ఆఫీసు ముందు దిగిన తన ఫొటోనూ ఈ ట్వీట్‌కు రజత్ సంబ్యాల్ జోడించాడు.
రజత్ సంబ్యాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆయనను ఎంకరేజ్ చేశారు. విధిని సవాల్ చేయలేమని, స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా రజత్ సరిపోతాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. కాగా, సివిల్స్ సాధించలేవేమో గానీ... ఈ క్రమంలో పోగుచేసుకున్న మేధా సంపత్తి ఎప్పుడూ వృథా కాదని, అది ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని మరో యూజర్ తెలిపాడు. భావి సివిల్ యాస్పిరెంట్‌కు మెంటర్‌గా పని చేస్తే బాగుంటుందని ఓ సూచన ఇచ్చాడు.
ప్రతి ఏడాది యూపీఎస్సీ టాపర్ స్టోరీలే కుప్పలుగా వస్తున్నాయని, కానీ, కొన్ని సార్లు ఇలాంటి స్టోరీలూ కూడా వినడం జీవితంలో ప్రయాణించడానికి చాలా అవసరం అని ఇంకో యూజర్ రాసుకొచ్చాడు. ఇలాంటి గాధలు మరిన్ని రావాలని కోరాడు. ఇది సక్సెస్‌ఫుల్ కాకున్నా.. చెప్పుకొదగ్గ నిష్క్రమణ అని పేర్కొన్నాడు.
ఏ పరీక్ష కూడా ఒక మనిషి విలువను లెక్క గట్టలేవని, సివిల్స్ ప్రిపరేషన్ సమయం అంతా వృథా అయినట్టు భావించవద్దని మరో యూజర్ పేర్కొంది. ఇన్నాళ్ల కృషి తన భవిష్యత్ నిర్మాణంలో కీలకంగా ఉపయోగపడుతుందని, ఇది తాను స్వీయ అనుభవంతో చెబుతున్న మాట అని వివరించింది.
సివిల్స్ సాధించలేదని వ్యాకుల పడవద్దని, జీవితమంటే కేవలం ఒక పరీక్షలో నెగ్గడమే కాదని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. కానీ, ఇలాంటి వైఫల్యాన్ని బహిరంగంగా నిర్భయంగా వెల్లడించగలిగే అతి తక్కువ మందిలో ఒకడిగా నిలిచావని మెచ్చుకున్నాడు.
