బీజేపీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందని యూపీ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ అన్నారు. ముస్లిం సమాజం బీజేపీని, యోగిని, మోడీని ప్రేమిస్తుందని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీ ప్రభుత్వంలో ఇటీవలే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డానిష్ ఆజాద్ అన్సారీ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. ముస్లింలు బీజేపీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టపడుతారని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో డానిష్ ఆజాద్ అన్సారీ చురుగ్గా పాల్గొన్నారు. బీజేపీ విజయానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అనంతరం ఆయన విరామం తీసుకొని ముస్సోరీకి విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆ సమయంలోనే ఆయనకు మంత్రివర్గంలో చోటిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు.
రెండో సారి అధికారం చేపట్టిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2.0లో అన్సారీ ఏకైక ముస్లిం మంత్రి. గత ప్రభుత్వంలో ముస్లిం మంత్రిగా ఉన్న మొహ్సిన్ రజా స్థానంలో ఈ సారి అన్సారీకి అవకాశం ఇచ్చారు. డానిష్ యూపీ బీజేపీ మైనారిటీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. అలాగే మునుపటి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆయన 2018 నుంచి ఉర్దూ భాషా కమిటీ సభ్యునిగా కొనసాగారు.
మాజీ మంత్రి రజాపై ఫిర్యాదుల కారణంగా పార్టీ ఈ సారి మంత్రివర్గం నుంచి రజాను తప్పించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం అన్సారీ యూపీ అసెంబ్లీలో సభ్యుడిగా లేరు. అయితే ఆయనను శాసన మండలికి నామినేట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. అన్సారీ లక్నో విశ్వవిద్యాలయం నుంచి క్వాలిటీ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అదే సమయంలో (2011)లో ఆయన RSS విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యునిగా విద్యార్థి రాజకీయాల్లో చేరాడు. 2018 వరకు ABVP లక్నో మహానగర్ యూనిట్‌లో వివిధ సంస్థాగత పదవులను నిర్వహించాడు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
అన్సారీ ముస్లిం సామాజికవర్గంలోని సున్నీ వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఈ వర్గం సాధారణంగా బీజేపీకి వ్యతిరేకమని భావిస్తారు. అందుకే ఆ వ్యతిరేక భావనను తొలగించడానికి ఆయనకు మంత్రి ఇచ్చారని తెలుస్తోంది. మాజీ మంత్రి రజా ముస్లింల షియా వర్గానికి చెందినవాడు, ఇది బీజేపీకి సాపేక్షంగా ఎక్కువ అనుకూలమని నమ్ముతారు. ఉదాహరణకు లక్నోలో బీజేపీకి షియా ముస్లిం ఓట్లు పడతాయని భావిస్తారు.
“ అన్సారీ ఓబీసీ ముస్లిం. ఆయనను (కొత్త) మంత్రివర్గంలోకి చేర్చడం ద్వారా బీజేపీ OBC ముస్లింల ఓటర్లను చేరుకోవడానికి ప్రయత్నించింది ” అని ఆ పార్టీకి చెందిన నాయకుడు అన్నారు.
మంత్రి వరించిన సందర్భంగా అన్సారీ ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. “ నాకు మంత్రి ఇవ్వడం వల్ల బీజేపీ పట్ల సున్నీ ముస్లింల అభిప్రాయం మారిపోయింది. ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల కోసం యోగి ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసింది. రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు, ఆయుష్మాన్ కార్డు పథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయి. ముస్లింలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు, అందుకే వారు బీజేపీని, యోగిని, మోదీని ప్రేమిస్తారు. ’’ అని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం జనాభాలో దాదాపు 10 శాతం మంది బీజేపీకి ఓటు వేశారని అన్సారీ పేర్కొన్నారు.
తూర్పు యూపీ, సెంట్రల్ యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లోని ముస్లిం జనాభా అధికంగా ఉన్న వివిధ జిల్లాలో అన్సారీ ప్రచారం చేశారు. కాషాయ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ఏవైనా సవాళ్లను ఎదుర్కొన్నారా అని అడిగిన ప్రశ్నకు అన్సారీ సమాధానమిస్తూ.. “ సామాన్య ముస్లింలు నన్ను వ్యతిరేకించరు. మరేదైనా పార్టీతో సంబంధం ఉన్నవారు ఎస్పీ, బీఎస్పీల ఆలోచనా విధానం ఉన్నవారు మాత్రమే నన్ను వ్యతిరేకిస్తారు. సామాన్య ముస్లింలు బీజేపీ పనిని ఇష్టపడుతున్నారు.’’ అని తెలిపారు. “ సీఎం యోగీ, ప్రధాని మోడీ నాకు మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. యువత, సమాజంలోని అన్ని ఇతర వర్గాల సాధికారత, సంక్షేమం కోసం నేను పని చేస్తాను ’’ అని తెలిపారు.
