హిందూ దేవతలపై బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మరాయి. “ఆత్మ- పరమాత్మ” అనే భావన కేవలం ప్రజల విశ్వాసం అని అన్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని కూడా పాశ్వాన్ ప్రశ్నించారు.
హిందూ దేవతలపై బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మరాయి. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని పిర్‌పైంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లాలన్ పాశ్వాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లాలన్ పాశ్వాన్ మాట్లాడుతూ.. “ఆత్మ- పరమాత్మ” అనే భావన కేవలం ప్రజల విశ్వాసం అని అన్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని కూడా పాశ్వాన్ ప్రశ్నించారు. ‘‘లక్ష్మీ దేవిని పూజించడం ద్వారానే సంపద లభిస్తే.. ముస్లింలలో కోటీశ్వరులు, బిలీయనీర్లు ఉండేవారు కాదు. ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు.. మరి ధనవంతులు కాదా?. ముస్లింలు సరస్వతీ దేవిని పూజించరు... ముస్లింలలో పండితులు లేరా? వారు IAS లేదా IPS కాలేదా?’’అని పాశ్వాన్ అన్నారు.
ఆత్మ - పరమాత్మ అనే భావన కేవలం ప్రజల విశ్వాసమని అన్న పాశ్వాన్.. ‘‘మీరు నమ్మితే అది దేవత.. లేకపోతే అది కేవలం శిలా విగ్రహం. మనం దేవుళ్లను, దేవతలను నమ్ముతున్నామా లేదా అనేది మన ఇష్టం. తార్కిక ముగింపును చేరుకోవడానికి శాస్త్రీయ ప్రాతిపదికన ఆలోచించాలి. మీరు నమ్మడం మానేస్తే.. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది’’ అని అన్నారు.
ఇంకా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘‘బజరంగబలి శక్తి కలిగిన దేవత అని, బలాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ముస్లింలు లేదా క్రైస్తవులు బజరంగబలిని పూజించరు. వారు శక్తివంతులు కాదా? మీరు నమ్మడం మానేసిన రోజు ఇవన్నీ ముగుస్తాయి’’అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు హిందూవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగల్‌పూర్‌లోని షెర్మారీ బజార్‌లో పాశ్వాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి.. ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఇక, గతంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా లాలన్ పాశ్వాన్ వార్తల్లో నిలిచారు.
