ముస్లిం దుకాణదారులు పట్టణం విడిచి వెళ్లాలి : ఉత్తర కాశీలో వెలసిన వివాదాస్పద పోస్టర్లు
ఉత్తరకాశీలో కొన్ని వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. అందులో ముస్లిం దుకాణాదారులందరూ జూన్ 15వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని గుర్తు తెలియని దుండగులు పేర్కొన్నారు. మహాపంచాయత్ కు ముందే వెళ్లిపోవాలని అందులో హిందీలో రాసి ఉంది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి పట్టణంలో ముస్లిం దుకాణదారులు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఉత్తరకాశీలోని పురోలా ప్రధాన మార్కెట్లో సోమవారం నుంచి కనిపిస్తున్న ఈ పోస్టర్లలో ముస్లిం వ్యాపారులు జూన్ 15 లోగా వెళ్లిపోవాలని పేర్కొన్నాయి. మే నెలలో మైనర్ బాలికపై అపహరణ యత్నంపై ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరు మైనారిటీ వర్గానికి చెందినవారు.
ఈ నెల 15న జరిగే మహాపంచాయత్ కు ముందే ఆ ప్రాంతంలోని ముస్లింలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోస్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. ‘‘2023 జూన్ 15న తలపెట్టిన మహాపంచాయత్ కు ముందే లవ్ జిహాదీలు దుకాణాలను విడిచిపెట్టాలి. దీనిని పాటించకపోతే అది సమయంపై ఆధారపడి ఉంటుంది.’’ అని హిందీలో రాసి ఉన్న పోస్టర్లు పేర్కొన్నాయి. ఈ పోస్టర్ పై 'దేవభూమి రక్షా అభియాన్' (దేవుని భూమి రక్షణ ఉద్యమం) అని రాసి ఉంది.
కిడ్నాప్ యత్నం ఘటనపై రైట్ వింగ్ గ్రూపులు నిరసన తెలిపిన తర్వాత పోస్టర్లు కనిపించాయని నివేదిక పేర్కొంది. నిరసన సందర్భంగా ముస్లింలకు చెందిన కొన్ని దుకాణాలు, ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. హింస వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. అభ్యంతరకర పోస్టర్లను తొలగించామని, పోస్టర్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.