పశ్చిమ బెంగాల్‌లో మత సామరస్యం వెల్లివెరిసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే దుర్గాపూజ నాటి కుమారి పూజను ఓ ముస్లిం యువతితో చేయించారు. ఈ సమయంలో బాలిక తల్లి కూడా బురఖా వేసుకుని తన తల్లి పక్కనే కూర్చొంది.  

సాంప్రదాయ బనారసీ చీర, పూల తలపాగా , ఆభరణాలు , అరచేతులకు గోరింటాకు పూసుకుని రిమిషా అనే ముస్లిం అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం ఆమె బక్రీద్ రోజున దుర్గాదేవిని పూజించడమే. కుమారి పూజలో భాగంగా రిమిషా కోల్‌కతాలో దుర్గా పూజ చేశారు. అంతేకాదు.. రిమిషా తల్లి సంజిదా బురఖాలో తన పక్కనే కూర్చొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఖుతీ పూజ అనేది దుర్గాపూజ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. పండల్ నిర్మాణాన్ని ప్రారంభించే ముందు దీనిని నిర్వహిస్తారు. బెంగాలీ పదం ఖుతిని ఆంగ్లంలో పోల్‌గా పిలుస్తారు.

సాధారణంగా ఖుతీ పూజ రథయాత్ర లేదా ఉల్టా రథయాత్ర రోజున నిర్వహిస్తారు. ఎందుకంటే అవి పవిత్రమైన రోజులు . కానీ ఈద్ రోజున ఖుతి పూజ నిర్వహించడం అపూర్వమైనది. మత సామరస్య సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే నిర్వహకులు ఈ ఏర్పాట్లు చేశారు. దుర్గా పూజల సమయంలో బాలికలను అమ్మవారిలా అలంకరించి ఆమెకు పూజలు చేస్తారు. దీనినే కుమారి పూజగా హిందువులు చెబుతారు. ఈ క్రమంలో రిమిషా పూజలో పాల్గొన్న వెంటనే ధక్ (సాంప్రదాయ డ్రమ్), షాక్ (శంఖం)తో పవిత్రమైన ధ్వనులు చేశారు. సింథి సర్కస్ మైదాన్ సమీపంలోని కాశీశ్వర్ శివాలయంలో ఈ ఖుతీ పూజ జరిగింది. బారానగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దుర్గాపూజ 75వ వసంతంలోకి అడుగుపెట్టడం విశేషం.

ఈ సందర్భంగా బారానగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజోయ్ ఘోష్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన హింస తమను ఎంతగానో బాధించిందన్నారు. హిందువులు, ముస్లింలు ఎప్పుడూ కలిసిమెలిసి జీవించేవారని చిన్నప్పటి నుంచి చదువుతూనే వున్నామని .. కానీ ప్రస్తుతం మత ప్రాతిపదికన ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈద్ రోజున కుమారి పూజ నిర్వహించాలని నిర్ణయించినట్లు అజయ్ తెలిపారు. మతపరమైన సంఘాలను ఏకం చేసే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఇతర సంఘాలకు సూచించారు.