గడ్డం చేసుకోలేదని ఓ ఎస్సై ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఇంటెసర్ అలీ బాగ్ పత్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని  ఓ ప్రాంతానికి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతనికి గడ్డం పెంచుకునే అలవాటు ఉంది. అయితే.. ఆ గడ్డం తీసేయాల్సిందిగా ఉన్నతాధికారులు కోరగా.. అతను నిరాకరించాడు. అప్పటికే అతనికి ఉన్నతాధారులకు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. కానీ అతను వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో.. అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్బంగా బాగ్‌పత్‌ ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘పోలీసు మాన్యువల్‌ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉంది. మిగతావారందరూ నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందే. ఒకవేళా గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్‌ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించాము. అతడు దానిని పాటించలేదు.. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకున్నాడు. దాంతో సస్పెండ్‌ చేశాం’ అని తెలిపారు. ఇంటెసర్‌ మాట్లాడుతూ.. ‘గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ నేను దరఖాస్తు చేశాను.. కానీ స్పందన రాలేదు’ అని తెలిపారు