ముంబయి నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని చిన్న చిన్న ముక్కులుగా నరికి.. తర్వాత ఆ ముక్కలను టాయ్ లెట్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ లోకి వదిలారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని గ్లోబల్ సిటీ విరార్ లోని బాచ్ రాజ్ పారడైజ్ సీ బ్లాక్ లో మంగళవారు సెప్టిక్ ట్యాంక్ బ్లాక్ అయ్యింది. ఆ బ్లాక్ లోని  చాలా మంది బాత్రూమ్ లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. దీంతో.. వారు సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులకు సమాచారం అందించారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేవారు వచ్చి.. ఎందుకు బ్లాక్ అయ్యిందో పరిశీలిస్తుండగా.. వారికి చిన్న చిన్న ముక్కలు మనిషి శరీర అవయవాలు కనిపించాయి. 

దీంతో.. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అందులో మనిషి వేలు.. ఆ వేలికి ఉంగరం కూడా ఉన్నట్లు గుర్తించారు. చాలా చిన్న చిన్న ముక్కులుగా కత్తిరించడంతో.. చనిపోయింది ఆడో, మగో అర్థం కావడం లేదన్నారు.  టాయ్ లెట్ ప్లష్ ద్వారా వీటిని పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

సీ బ్లాక్ లోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఆ బ్లాక్ లో మూడు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని.. వాటిలో కూడా తనిఖీలు చేస్తామని చెప్పారు. తెల్లవారు జామున చంపేసి.. ఇలా టాయ్ లెట్ లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.