ముంబయిలో 1999 మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఛోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షూట్ అప్పటి నుంచి 2019 వరకు అంటే 20 ఏళ్లుగా మిస్సింగ్‌లోనే ఉన్నాడు. కానీ, ఆ మధ్యలోనే కొన్ని సంవత్సరాలు నిందితుడు మరో కేసులో జైలులో ఉండటం గమనార్హం. 

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన మర్డర్ కేసులో నిందితుడు, ఛోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ 20 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. 20 ఏళ్ల నుంచి ఈ కేసు నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆసక్తికరంగా ఈ 20 ఏళ్లలో కొన్ని సంవత్సరాలు అతను మరో కేసులో జైలులో కూడా ఉన్నాడు. కానీ, ఆ ఖైదీనే 20(1999 మర్డర్ కేసు) ఏళ్ల మర్డర్ కేసులో నిందితుడు అని గుర్తించలేకపోయారు. దీనిపై ముంబయిలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కేసుల స్పెషల్ జడ్జీ ఏఎం పాటిల్ ఈ కేసులో వ్యాఖ్యలు చేశారు. 1999 మర్డర్ కేసులో నుంచి నిందితుడు మహిర్ సిద్దిఖీని నిర్దోషిగా ఫిబ్రవరి 3న ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు. 1999లో బొంబాయ్ అమన్ కమిటీ ప్రెసిడెంట్ వాహిద్ అలీ ఖాన్‌ హత్య కేసులో మహిర్ సిద్దిఖీ నిందితుడిగా ఉన్నాడు.

ఈ మర్డర్ కేసు విచారణలో పోలీసుల దర్యాప్తులో ఎన్నో లోపాలను కోర్టు ఎత్తి చూపింది. ముంబయిలో 1999 జులైలో ఎల్టీ మార్గ్ ఏరియాలో వాహిద్ అలీ ఖాన్‌ను అతని ఇంటి వద్దే సిద్దిఖీ మరో నిందితుడు కలిసి షూట్ చేసి చంపేశారు. వారిద్దరూ స్పాట్ నుంచి పారిపోయారు. 2019 మే నెలలో పోలీసులు సిద్దిఖీని ట్రేస్ చేసి అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా కొంత ఆధారంగా దొరికిన తర్వాత చార్జిషీట్ ఫైల్ చేశారు. దర్యాప్తు చేస్తుండగా సిద్దిఖీ, ఛోటా షకీల్ సహా ఆరుగురి ప్రమేయం ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఛోటా షకీల్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగినట్టూ స్పష్టం చేసుకున్నారు. 

దీనికి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేస్తున్న సమయంలో కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. అతన్ని అరెస్టు చేసే వరకూ నిందితుడు పరారీలోనే ఉన్నాడని పేర్కొంది. కానీ, 2014 నుంచి 2019 కాలంలో అతన్ని సీఐడీ అరెస్టు చేసింది. ఆ కాలంలో విచారణ ఖైదీగా ఉన్నాడు. జైలులోనే ఉన్న సిద్దిఖీని పోలీసులు పట్టుకోలేకపోయారు. జైలులోనే ఉన్న నిందితుడిని పట్టుకోవడంలో ఎలా విఫలం అయ్యారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.

Also Read: రోడ్లు దారుణంగా ఉన్నాయ్.. కొన్ని జిల్లాలకు ట్రైన్‌పై వెళ్లాను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు సీఎం లేఖ

సిద్దికీ గురించిన రికార్డు మెయింటెయిన్ చేసిన పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారని, ఈ మిస్టరీని బట్టబయలు చేయలేకపోవడానికి గల కారణం పోలీసు ఏజెన్సీకి తెలిసి ఉంటుందని జడ్జీ పేర్కొన్నారు. షూట్ చేసేటప్పుడు నిందితులను చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని తెలిపారు. కాగా, ఘటన గురించి చెప్పినవారితో సాక్షులు చెప్పిన కథనంతో పొంతన లేదని అన్నారు. 

షూట్ చేసిన పిస్టల్, అక్కడి నుంచి నిందితులు పారిపోవడానికి వినియోగించిన మోటార్ సైకిల్‌ను కూడా పోలీసులు రికవరీ చేసుకోలేకపోయారని న్యాయమూర్తి తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచిన మెటీరియల్ ఎవిడెన్స్ పైనా అనేక అనుమానాలు ఉన్నాయని వివరించారు. ఈ కారణాల దృష్ట్యా నిస్సందేహంగా నేరస్తుడు నిందితుడే అని తేల్చలేమని, కాబట్టి, అతన్ని నిర్దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.