డ్రైవింగ్ ఫీల్డ్‌లో మరీ ముఖ్యంగా హెవీ వెహికిల్స్ డ్రైవింగ్‌లో మహిళలు డ్రైవర్‌లుగా ఉండటం ఇది వరకు చూడని విషయం. కానీ, మహారాష్ట్రకు చెందిన 42 ఏళ్ల లక్ష్మీ జాదవ్ ఈ జాఢ్యాన్ని పటాపంచలు చేయబోతున్నారు. ఈ నెల 27 లేదా 28 నుంచి తొలిసారిగా ఆమె ముంబయి నగరంలో బస్‌లను నడపబోతున్నారు. ‘బెస్ట్’ బసు నడిపే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించనుంది.
ముంబయి: డ్రైవింగ్ ఫీల్డ్ అంటే పురుషులే ఉంటారనే ఆలోచన మెరవడం సహజం. ముఖ్యంగా బస్ డ్రైవర్‌లలో మహిళలు కానరారు. బస్ డ్రైవర్ అంటే పురుషుడే అనే ఆలోచనలకు 42 ఏళ్ల లక్ష్మీ జాదవ్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. తొలిసారి, ఆమె పురుషుల ప్రాబల్యం ఉన్న డ్రైవింగ్ ఫీల్డ్‌లోకి దూసుకొస్తున్నారు. ఆడ, మగ వారి సామర్థ్యాలు అనే గీతను చెరిపేస్తున్నారు. త్వరలోనే ఆమె మహిళా బస్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించనున్నారు. ముంబయి నగరంలో ఆమె బస్ నడపనున్నారు. అదీ ధారావి డిపో నుంచి దక్షిణ ముంబయి రూట్‌లో డ్రైవ్ చేయడం గమనార్హం.
ముంబయి మహానగరంలో బస్‌లను బృహన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) నడుపుతుంది. కొందరు కాంట్రాక్టర్లూ తమ బస్సులను బెస్ట్ కింద నడుపుతుంటారు. ఇలాంటి ఓ కాంట్రాక్టర్ కింద ఎంప్లాయిగా ఉన్న లక్ష్మీ జాదవ్ ఈ నెల 27వ తేదీ లేదా 28వ తేదీల్లో బస్ డ్రైవర్‌గా విధులు చేపట్టనున్నారు. లక్ష్మీ జాదవ్ తొలి ట్రిప్‌ను రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేలు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
లక్ష్మీ జాదవ్ మాత్రమే కాదు.. మరో ఇద్దరు మహిళా డ్రైవర్‌లకు బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నది. కేవలం డ్రైవర్లే కాదండోయ్.. కండక్టర్లనూ రిక్రూట్ చేసుకోబోతున్నది. 70 మంది మహిళా బస్ కండక్టర్లను పనిలో పెట్టుకోబోతున్నది. ఆ తర్వాత మరో 100 మందిని కండక్టర్లుగా రిక్రూట్ చేసుకోవాలనే ఆలోచనలో బెస్ట్ ఉన్నది. బస్ డ్రైవర్‌లు, కండక్టర్లుగా మహిళలను నియమించుకుని బెస్ట్.. మహిళా సాధికారతను చాటి చెబుతున్నదనే ప్రశంసలు వస్తున్నాయి.
ముంబయి నగరంలో 1947 ఆగస్టు 7వ తేదీ నుంచి బెస్ట్ బస్సులను నడుపుతున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ బస్సులను ఒక్క మహిళా డ్రైవర్ కూడా నడపలేదు. ఈ నగరంలో వందేళ్లకుపైగా చరిత్ర గల రవాణా వ్యవస్థలో తొలిసారి ఒక మహిళా బస్సులను నడపనున్నారు. లక్ష్మీ జాదవ్ ఈ రికార్డును తన పేరిట రాసుకోబోతున్నారు. బెస్ట్ చరిత్రలో తొలిసారి ఒక మహిళా డ్రైవర్ సిటీలో బస్సు నడుపబోతున్నారని బెస్ట్ జనరల్ మేనేజర్ లోకేశ్ చంద్ర వెల్లడించారు. త్వరలోనే మరింత మంది మహిళా డ్రైవర్లు ఈ సర్వీసులోకి చేరుతారని వివరించారు.
తెలంగాణలోనూ త్వరలోనే మహిళా బస్ డ్రైవర్‌గా కరీంనగర్‌కు చెందిన కవిత రిక్రూట్ కాబోతున్నట్టు, తెలంగాణలో ఆమె తొలి మహిళా బస్ డ్రైవర్‌గా రికార్డులు తిరగరాయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
