Mumbai: కుట్రలో భాగంగా పార్టీ పేరు, గుర్తును లాక్కుని శివసేనను అంతమొందించాలని బీజేపీ యోచిస్తోందని ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. 'మీరు మా పార్టీ పేరును దొంగిలించవచ్చు, థాక్రే పేరును దొంగిలించలేరంటూ' ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే 2024 లోక్ సభ ఎన్నికలు దేశంలో చివరి ఎన్నికలుగా మారే అవకాశం ఉందంటూ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, చిహ్నం విషయంలో ఏక్ నాథ్ షిండేపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే 2024 లోక్ సభ ఎన్నికలు దేశంలో చివరి ఎన్నికలుగా మారే అవకాశం ఉందంటూ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ గా విమ‌ర్శ‌లు గుప్పించారు. 'నా నుంచి అన్నీ దొంగిలించారు. మా పార్టీ పేరు, గుర్తును దొంగిలించారు కానీ థాక్రే అనే పేరును దొంగిలించడానికి వీలు లేదు. దొంగిలించ‌లేరు.." అని అన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామనీ, రేపటి నుంచి విచారణ ప్రారంభమవుతుందని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. అలాగే, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని ఆపకపోతే 2024 లోక్ సభ ఎన్నికలు దేశంలో చివరి ఎన్నికలుగా మారే అవకాశం ఉందనీ, ఆ తర్వాత ఇక్కడ అరాచకం ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు. 

పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పేరును ఉపయోగించవద్దనీ, ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని షిండే నేతృత్వంలోని శివసేనకు ఆయన సవాలు విసిరారు. "నేను షిండే వర్గానికి సవాలు విసురుతున్నాను, నా తండ్రి పేరును విడిచిపెట్టి, పార్టీ పెట్టడం ద్వారా వారి తండ్రి పేరును ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలని నేను సవాలు చేస్తున్నాను" అని అన్నారు. రాజ‌కీయ కుట్రలో భాగంగా పార్టీ పేరు, గుర్తును లాక్కోవడం ద్వారా శివసేనను అంతమొందించాలని బీజేపీ యోచిస్తోందని ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందనీ, తీర్పు వచ్చే వరకు వారి నిర్ణయం చెప్పవద్దని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ థాక్రే పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ను రద్దు చేయాలనీ, ఎన్నికల కమిషనర్లను ప్రజలే ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం పిటిషన్ ను త్వరగా లిస్టింగ్ చేయాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే సీజేఐ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. శాసనమండలి, రాజ్యసభలో తమకు మెజారిటీ ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఈసీఐ విఫలమైందని ఉద్ధవ్ థాక్రే పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో కేవలం శాసనపరమైన మెజారిటీ మాత్రమే ఈసీఐ ఉత్తర్వులను జారీ చేయడానికి ఆధారం కాదని ఆయన వాదించారు. 

గత వారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి పార్టీ పేరు శివసేన, విల్లు-బాణం గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. గత ఏడాది థాక్రేపై షిండే తిరుగుబాటు చేసినప్పటి నుంచి శివసేనలోని రెండు వర్గాలు (ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే) పార్టీ విల్లు బాణం గుర్తు కోసం పోరాడుతున్నాయి. నిజమైన శివసేనగా గుర్తింపు పొందాలన్న నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఎన్నికల కమిషన్ హడావుడి చేస్తోందనీ, ఈ నిర్ణయం బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తుందనడానికి నిదర్శనమని ఉద్ధవ్ థాక్రే వర్గం ఆరోపించింది.