Asianet News TeluguAsianet News Telugu

రూ. 11వేల రికవరీకి ప్రయత్నించి.. ఆన్‌లైన్‌లో రూ. 11 లక్షలు మోసపోయిన మహిళ

ఓ వృద్ధురాలు ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేస్తు సుమారు రూ 10వేల కోల్పోయింది. ఆ తర్వాత మరోసారి డ్రై ఫ్రూట్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి కూడా ఎక్కవ మొత్తాన్నే పోగొట్టుకుంది. వీటిని రికవరీ చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఓ సైబర్ నేరస్తుడి చేతిలో మోసపోయింది. ఏకంగా రూ. 11 లక్షల మొత్తాన్ని ఆమె పోగొట్టుకుంది. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 

mumbai woman lost rs 11 lakhs in cyber fraud.. which involves pizza online order
Author
Mumbai, First Published Jan 16, 2022, 6:23 AM IST

ముంబయి: ఓ వృద్ధురాలు.. ఆన్‌లైన్‌(Online)లో పిజ్జా ఆర్డర్(Pizza Order) చేసింది. ఓ సారి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకుంది. ఈ రెండు సార్లు ఆమె రూ. 11 వేలకు పైగా పోగొట్టుకున్నది. ఆ డబ్బును తిరిగి పొందాలని శతవిధాల ప్రయత్నించింది. ఆన్‌లైన్‌లో పోయిన డబ్బు రికవరీ చేసుకోవడానికి గూగుల్‌లోనూ వెతికింది. అందులో ఓ కాంటాక్టు నెంబర్ కనిపించింది. ఆ నంబర్‌కు కాల్ చేసి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతూ పోగొట్టుకున్న డబ్బుల రికవరీ గురించి అడిగింది. ఈ క్రమంలోనే ఫోన్‌ కాల్‌లో ఎదుటి వ్యక్తి(Cyber Fraudster) చెప్పినట్టుగా చేసి చివరకు రూ. 11 లక్షల సొమ్మును పోగొట్టుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆంధేరి సబర్బన్‌లో నివసిస్తున్న ఓ వృద్ధురాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. గతేడాది జూలైలో పిజ్జా కోసం ఆర్డర్ చేసింది. తన ఫోన్ ద్వారా ఆ పిజ్జా డబ్బులు కడుతూ.. రూ. 9,999 పోగొట్టుకుంది. అదే తీరులో అక్టోబర్ 29న ఆమె మరోసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తూ రూ. 1,496 కోల్పోయింది. ఈ రెండు ఉదంతాల్లో తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందాలని ఆమె ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం గూగుల్‌లో సెర్చ్ చేసింది. అందులో ఓ కాంటాక్ట్ నంబర్ కనిపించింది. ఆ నంబర్‌కు ఫోన్ చేసింది. 

ఆ ఫోన్ కాల్ అందుకున్న సైబర్ నేరగాడు.. ఆమె పోగొట్టుకున్న డబ్బు తిరిగి ఇప్పిస్తామని నమ్మించాడు. అందుకోసం ఆమె ఫోన్‌లో ఆ ఫ్రాడ్‌స్టర్ చెప్పిన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరాడు. ఆ అప్లికేషన్ ద్వారా ఆ సైబర్ నేరస్తుడికి ఆమె ఫోన్ యాక్సెస్ లభించింది. ఆ యాక్సెస్ ద్వారా ఆమె బ్యాంకు వివరాలు, పాస్‌వర్డులు పొందగలిగాడు.

ఆ తర్వాత వాటిని ఉపయోగించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 11.78 లక్షలను విత్‌డ్రా చేసుకున్నాడు. గత ఏడాది నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ డబ్బును ఆమె బ్యాంకు అకౌంట్‌ నుంచి ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత వృద్ధురాలు తన అకౌంట్ వివరాలు చూసుకోగా, తాను దాచుకున్న సొమ్ము అంతా కోల్పోయినట్టు రియలైజ్ అయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇప్పుడు ఆ నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మూడు సార్లు ఆమె నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేయడానికి ఆ నేరస్తుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. వేలాది మంది నిరుద్యోగుల నుండి  డ‌బ్బులు దండుకుంటున్న  గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ కేంద్రంగా అక్రమంగా కాల్‌ సెంటర్‌ నడుపుతూ..  దేశ‌వ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ.. దగాకు పాల్పడింది ఢిల్లీ గ్యాంగ్‌. ఈ గ్యాంగ్ ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్‌ సింగ్‌, అనుభవ్‌సింగ్‌, నఫీజ్‌, సైఫ్‌ అలీ, యోగిత, షాలు కుమారి, ప్రియ, శివానీలు ఒక మఠాగా ఏర్పడి.. మయూర్‌ విహార్‌ పేరుతో ఢిల్లీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios