ముంబై: ఓ వ్యక్తి తన భార్యను రైల్లోంచి కిందికి తోసేశాడు. దాంతో ముంబైకి చెందిన 26 ఏళ్ల ఆ మహిళ మరణించింది. వేగంగా దూసుకెళ్తున్న రైలులో డోర్ వద్ద భార్యాభర్తలు నించున్నారు. ఈ సమయంలో భర్త ఆమెను కిందికి తోసేశాడు. ఈ సంఘటన గురించి గురువారనాడు పోలీసులు వెల్లడించారు. 

చెంబూరు, గోవండి రైల్వే స్టేషన్ల మధ్య ఆ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. భార్య మృతితో భర్తను పోలీసులు అరెస్టు చేశారు 31 ఏళ్ల నిందితుడు, మృతురాలు కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు మనఖుర్డ్ ప్రాంతానికి చెందినవారు. రెండు నెలల క్రితమే వారికి వివాహమైంది.

సోమవారం సాయంత్రం వారు స్థానిక రైలులో ప్రయాణం చేస్తున్నారు. మొదటి భర్త ద్వారా పుట్టిన ఏడేళ్ల కూతురు కూడా మహిళ వెంట ఉంది. దంపతులు కోచ్ లోని డోర్ వద్ద నించున్నారు. కదులుతున్న రైలులో మహిళ కాస్తా పక్కకు ఒరిగింది. ఆ సమయంలో భర్త ఆమెను పట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత పట్టు వదిలాడు. దాంతో ఆమె ట్రాక్స్ మీద పడింది. 

గోవండి స్టేషన్ వద్ద రైలు ఆగిన వెంటనే అదే కోచ్ లో ప్రయాణిస్తున్న మహిళ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వ్యక్తిని పోలీసులు రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. అతన్ని సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లారు. స్పృహ తప్పి పడి ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె రమణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.