అర్థరాత్రిపూట హౌసింగ్ సొసైటీలో నానా రచ్చ చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేయబోయారు. కాగా.. వారి అరెస్టుని అడ్డుకునేందుకు ఓ యువతి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పోలీసుల మందే దుస్తులు విప్పేసి.. ఇప్పుడు అరెస్టు చేయండి అంటూ నిలబడింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... కంటెంట్ రైటర్, మోడల్‌గా పనిచేస్తోన్న యువతి.. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. అక్టోబర్ 25న రాత్రి ఒంటి గంట సమయంలో కాంప్లెక్స్‌లోని సెక్యూరిటీ గార్డుతో ఆమె గొడవకు దిగింది. ఆ తరవాత 3 గంటల సమయంలో 100కు ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్ తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ యువతి తాగి ఉందని, రాత్రివేళ సిగరెట్లు తెమ్మని తనను అడిగిందని, నిరాకరించడంతో గొడవకు దిగి ఇష్టమొచ్చినట్లు కొట్టిందని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. ఈ గొడవలో యువతిదే తప్పుగా భావించిన పోలీసులు తమతో స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. 

అంతే ఆమె పోలీసులపై విరుచుకుపడింది. తనను విచారణకు రమ్మంటారా అని.. పోలీసులను తిట్టడం మొదలెట్టింది. అక్కడే వారి ముందే లిఫ్ట్ లోకి వెళ్లి.. దుస్తులు విప్పేసింది.  లోదుస్తులపై నిలబడి ఇప్పుడు తీసుకెళ్లండంటూ వీరంగం సృష్టించింది. లోదుస్తులపై ఉంటూనే మరో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసింది. పోలీసులు తమ వెంట మహిళా కానిస్టేబుల్‌ను తీసుకురాకపోవడంతో ఏం చేయాలో వారికి తెలియలేదు.

యువతి దస్తులు విప్పేసి వీరంగం వేస్తున్న సమయంలో అక్కడున్న ఒక వ్యక్తి వీడియో తీశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి వచ్చింది. వాస్తవానికి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ వీడియో కారణంగానే విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా, దుస్తులు విప్పి వీరంగం వేసిన యువతి శనివారం ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి అర్ధరాత్రి మహిళా కానిస్టేబుల్ లేకుండా తనను పోలీస్ స్టేషన్‌కు ఎలా రమ్మంటారని ప్రశ్నించింది. ఈ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.