మటన్ తక్కువగా వడ్డించిందని ఓ భర్త... భార్య ఒంటికి నిప్పు పెట్టాడు.  కాగా... సదరు మహిళ  ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ముంబయి నగరం సమీపంలోని జుయి కమోతు గ్రామానికి చెందిన మహిళ పల్లవి సరోడే కి మారుతీ సరోడే తో వివాహం జరిగింది. పల్లవి సరోడే ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. కాగా...మారుతీ సరోడే రోజూ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

అయితే... ఇటీవల పల్లవి ఇంట్లో మటన్ కూర వండింది. భర్తకు భోజనం పెట్టే సమయంలో... కూర కొద్దిగా వడ్డించింది. అయితే...కూర తనకు తక్కువగా పెట్టిందని.. భర్త మారుతీకి కోపం వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఆసమయంలో మారుతి మద్యం సేవించి ఉన్నాడు. 

తల్లి ఒంటికి నిప్పు అంటుకోవడంతో... చిన్నారులు సహాయం కోసం గట్టిగా అరిచారు. చిన్నారుల అరుపులు విన్న స్థానికులు వచ్చి ఆమెను  రక్షించారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వేరే ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.... ఈ ఘటన డిసెంబర్ 4వ తేదీన చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.