దేశంలోనే అతిపొడవైన సముద్ర వంతెన ముంబైలోని సముద్రంపై నిర్మితమవుతోంది. దాదాపు 18000 కోట్ల వ్యయంతో నిర్మించబడుతోన్న ఎంటీహెచ్ఎల్ పూర్తయిన తర్వాత ప్రతి నిత్యం 70,000 వేల వాహనాలకు సేవలు అందించనుంది.
భారత్‌లోని అతి పొడవైన సముద్ర వంతెన.. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్) నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు.. ఓపెన్ రోడ్ టోలింగ్ (ఓఆర్‌టీ) వ్యవస్థను కలిగివున్న తొలి వంతెనగా నిలుస్తుంది. దీని వలన ప్రయాణీకులు టోల్ గేట్ వచ్చినప్పుడు ఆగకుండా 100 కి.మీ వేగంతో దూసుకెళ్లవచ్చు. దాదాపు 18000 కోట్ల వ్యయంతో నిర్మించబడుతోన్న ఎంటీహెచ్ఎల్ పూర్తయిన తర్వాత ప్రతి నిత్యం 70,000 వేల వాహనాలకు సేవలు అందించనుంది. మే 24 నాటికి 16.5 కి.మీ పొడవుగల డెక్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఏడాదిలోనే వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్బంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమీషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వంతెన కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదని, ఆర్ధిక వృద్ధికి ఇంజిన్ అని అన్నారు. ఈ వంతెన ద్వారా హార్బర్ నుంచి 12-15 నిమిషాల వ్యవధిలోనే ముంబైలోని ప్రధాన భూభాగాలను చేరుకోవచ్చు. దీని వల్ల ముడి పదార్ధాల రవాణా, కార్మికుల చేరవేత సులభతరం అవుతుందని శ్రీనివాస్ చెప్పారు. ఎంటీహెచ్ఎల్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్ధిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ముంబైకి శాటిలైట్ సిటీగా వున్న నవీ ముంబైతో అనుసంధానం చేయడానికి ఉద్దేశించినది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రీలో ప్రారంభమై.. ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన థానే క్రీక్ మీదుగా నవా షెవా సమీపంలోని చిర్లే వద్ద ముగుస్తుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు బుధవారం సాయంత్రం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముంబై- నవీ ముంబై మధ్య ట్రాఫిక్‌ను వేగవంతం చేయడానికి, ముంబై, పూణే, గోవాలకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను ఎంటీహెచ్ఎల్ ప్రాజెక్ట్‌కు 30 ఏళ్ల క్రితమే రూపకల్పన చేశారు. ఎంఎంఆర్‌డీఏ నవంబర్ 2017లో ఈ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్‌లను అందించింది. ఏప్రిల్ 2018లో నిర్మాణం ప్రారంభం కాగా.. 4.5 సంవత్సరాల్లో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణం దాదాపు ఎనిమిది నెలలు ఆలస్యమైంది. డిసెంబర్ 2023 నాటికి బ్రిడ్జి పూర్తవుతుందని అంచనా.
