Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయ వాతావరణం కలుషితమైందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయనను ఆగస్టు 1న ఈడీ అరెస్ట్ చేయగా, నవంబర్ 9న బెయిల్ పై విడుదల అయ్యారు.
Maharashtra Politics: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయ వాతావరణం కలుషితమైందని అన్నారు. అక్కడ చాలా మంది వ్యక్తులు ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 9న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఈ విషయాన్ని గ్రహించానని రౌత్ చెప్పారు. రాజ్యసభ సభ్యుడైన సంజయ్ రౌత్ ను ఈ ఏడాది ఆగస్టు 1న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే, నవంబర్ 9న ముంబయిలోని కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు.
సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్న ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సేన వర్గం మౌత్ పీస్ అయిన సామ్నాలో తన వారపు కాలమ్ రోఖ్‌థోక్‌ను తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్రలో థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో సేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు కారణంగా కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ''ద్వేషపూరిత భావన ఉంది.. రాజకీయ నాయకులు ఇప్పుడు తమ ప్రత్యర్థులు జీవించి ఉండకూడదనుకునే స్థాయికి చేరుకున్నారు. మహారాష్ట్ర రాజకీయ వాతావరణం కలుషితమైంది, అక్కడ ప్రజలు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు" అని రౌత్ పేర్కొన్నారు.
"రాజకీయాల్లో చేదుకు ముగింపు పలకాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్య గురించి నన్ను అడిగినప్పుడు, అతను నిజం మాట్లాడుతున్నాడని నేను బదులిచ్చాను.." అని సేన నాయకుడు చెప్పారు. "ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఇప్పుడు లేవు, ఇవి ఇప్పుడు పేర్లు మాత్రమే. రాజకీయాలు విషతుల్యంగా మారాయి. బ్రిటీష్ హయాంలో అలా జరగలేదు" అని రౌత్ పేర్కొన్నారు. ఢిల్లీలోని నేటి పాలకులు తమ కోరికలను వినాలనుకుంటున్నారు. అలా చేయని వారిని శత్రువులుగా పరిగణిస్తారని ఆరోపించారు. "చైనా, పాకిస్తాన్ ఢిల్లీకి శత్రువులు కాదు, కానీ వారు నిజం మాట్లాడేవాళ్ళని, సూటిగా ఉండేవాళ్ళని శత్రువులుగా పరిగణిస్తారు.. అలాంటి రాజకీయ నాయకులు దేశ ఔన్నత్యాన్ని దిగజార్చారు'' అని సంజయ్ రౌర్ అన్నారు.
అంతకుముందు రోజు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి వస్తారని అన్నారు. అలాగే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా ఆయన అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్‌లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. "వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది" అని రౌత్ అన్నారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను గురించి ప్రస్తావించారు. కేంద్రంపై విమర్శల దాడిచేసిన రౌత్.. దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు అతన్ని శాశ్వతంగా కనిపించకుండా చేయాలనుకుంటున్నారని అన్నారు. దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు.
