నేరస్తులను కట్టడి చేయడంతో పాటు క్రైమ్ రేటును తగ్గించేందుకు గాను ముంబై పోలీసులు అమలు చేస్తున్న ఆపరేషన్‌ ఆలౌట్‌ సత్ఫలితాలను ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 39 మంది నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు.

నేరస్తులను కట్టడి చేయడంతో పాటు క్రైమ్ రేటును తగ్గించేందుకు గాను ముంబై పోలీసులు అమలు చేస్తున్న ఆపరేషన్‌ ఆలౌట్‌ సత్ఫలితాలను ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 39 మంది నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు.

ఇక నగరంలో అనుమానాస్పదంగా ఉన్న 951 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్‌ లేని ఆయుధాలతో తిరుగుతున్న వారు కూడా పట్టుబడుతున్నారు. పోలీసులు స్పెషల్ ఆపరేషన్‌తో నేరస్తుల్లో దడ మొదలైంది. 

ఛత్రపతి శివాజీ జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్‌ ఆలౌట్‌ చేపట్టారు. ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్, విశ్వాస్‌ నాంగరే–పాటిల్, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ జరిగింది.

దీనిలో భాగంగా పరారీలో ఉన్న 39 మంది నేరస్తులు, లైసెన్స్‌ లేకుండా ఆయుధాలతో తిరుగుతున్న 37 మంది, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హోటళ్లు, ముసాఫిర్‌ ఖానా, లాడ్జింగులు, గెస్ట్‌ హౌస్‌లు తదితర అద్దె నివాస గృహాలపైనా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు.

దీనితో పాటు రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్‌ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్‌ లక్ష్యమే. సిగ్నల్స్‌ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. 

మరోవైపు ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతోనూ ముంబై పోలీసుల ఆపరేషన్‌ చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారిని, తప్పిపోయి వారిని, విఫల ప్రేమికుల్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై దొరికారు. వీరి చిరునామా సేకరించిన పోలీసులు ఇళ్లకు చేరుస్తున్నారు.