హాలీవుడ్ మూవీ రేంజ్ రివెంజ్ డ్రామా ఒకటి ఇటీవల ముంబైలో బయటపడింది. 'మట్కా కింగ్' సురేష్ భగత్ భార్య జయ భగత్, ఆమె సోదరి ఆషాను హత్య చేయడానికి పన్నిన కుట్రను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 

జయ భగత్ తన భర్త సురేష్ భగత్ ను హత్య కేసులో దోషిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. నిజమైన ముంబై గ్యాంగ్ వార్స్ పద్ధతిలో లాగా జయ భగత్ ను హత్య చేయడానికి సురేష్ భగత్ తమ్ముడు వినోద్ భగత్ కుట్ర పన్నారు. సురేష్ భగత్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ కుట్ర జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబై పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వినోద్ భగత్ తన సోదరుడి హత్యకు ప్రతీకారం, మట్కా వ్యాపారంపై పూర్తి ఆదిపత్యం సాధించాలన్న కోరికతోనే జయ, ఆమె సోదరి హత్యకు కుట్ర పన్నాడు. దీనికోసం యుకెకు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ బషీర్ బెగాని అలియాస్ మామును సంప్రదించి హత్యలకు రూ.60 లక్షలు కాంట్రాక్టు చేసుకున్నాడు." కాంట్రాక్టులో భాగంగా బషీర్ అలియాస్ మాము యుకెలోని భగత్ నుండి డబ్బు బదిలీ తీసుకున్నాడు. 

ఈ సుపారీలో భాగంగా రణ్‌వీర్ శర్మ అలియాస్ పండిట్‌కు ఫస్ట్ డీల్ లో సుమారు 14 లక్షల రూపాయలను పండిట్ అకౌంట్ కి మాము బదిలీ చేశాడు. దీంట్లో భాగంగా జయ భగత్ ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులతో కలిసి పండిట్‌ కుట్ర పన్నాడు"అని ముంబై క్రైమ్ బ్రాంచ్ కి చెందిన డిసీపీ అక్బర్ పేర్కొన్నారు. 

డబ్బు చేతికి అందిన తర్వాత బిజ్నోర్ కు చెందిన కాంట్రాక్టు కిల్లర్లు జయ భగత్, ఆమె సోదరి ఇంటి దగ్గర ఫిబ్రవరీలో రెక్కీ నిర్వహించారు. కానీ లాక్ డౌన్ కారణంగా వారు తమ ప్రణాళికలను నిలిపివేశారు. మళ్లీ తర్వాత వీరు హత్య కుట్రలో భాగంగా వారికీ అవసరమైన ఆయుధాలు, ఫోటోలను సేకరించారు. 

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉత్తర ప్రదేశ్ లో బిజ్నోర్ నివాసి అయిన కిల్లర్ అన్వర్ దర్జీని వేరే కేసులో డిసెంబర్ 18న ఖార్దండాలో పట్టుకున్నారు. ఆ సమయంలో అతని దగ్గర రెండు దేశీయ పిస్టల్స్, ఆరు బులెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అతని దర్యాప్తు చేసినప్పుడు జయ భగత్, జయ నివాసం ఉన్న వీడియోలు, ఆమె సోదరి ఆశా ఫోటోలు అతని వద్ద ఉన్నాయి. 

దీనిమీద గట్టిగా ప్రశ్నించగా వినోద్ భగత్ ఆదేశాల మేరకు జయ మరియు ఆమె సోదరిని చంపడానికి దర్జీకి కాంట్రాక్ట్ లభించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అన్వర్ దర్జీ, రామ్వీర్ శర్మ అలియాస్ పండిట్ సహాయంతో బిజ్నోర్ కి చెందిన జావేద్ అన్సారీ చేత హత్య చేయించమని కోరాడు. 

ప్రస్తుతం యుకెలో మాంచెస్టర్‌లో ఉన్న బషీర్ బెగాని అలియాస్ మాము చేత పండిట్ ముఠా ఈ పని చేయడానికి ఒప్పుకున్నట్లు దర్యాప్తులో తేలింది. "మాము, పండిట్ మరియు వినోద్ భగత్ చాలా కాలం నుండి ఒకరికొకరు తెలుసు. 2012లో మట్కా ఆపరేటర్ ఘన్ష్యామ్ తులియా హత్యాయత్నంలో భాగంగా వీరు అహ్మదాబాద్ లో అరెస్టయ్యారు. నిందితుల విచారణ సమయంలో ఈ హత్య ఒప్పందం గురించి చెప్పారు. వ్యక్తికి రూ.30 లక్షలు చొప్పున 60 లక్షలు" తీసుకున్నట్లు క్రైమ్ పోలీసు కమిషనర్ మిలింద్ భరంబే అన్నారు.

గతంలో సురేష్ భగత్ కళ్యాణ్ మట్కా మార్కెట్‌లో ఒక పెద్ద లీడర్. ఈ మార్కెట్ లో రోజుకు వందల కోట్ల విలువైన లావాదేవీలు జరిగేవి. మట్కా వ్యాపారం మొత్తం విలువ రూ.3 వేల కోట్లపైనే. దీని మీద నియంత్రణ కోసం సురేష్ భగత్ భార్య జయ, కొడుకు హితేష్ కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా సురేష్ భగత్ ను చంపడానికి నిర్ణయించుకున్నారు. 

దీనికోసం వారు గ్యాంగ్ స్టర్స్ ప్రవీణ్ శెట్టి, హరీష్ మాండ్వికార్ లతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. 2008లో సురేష్ భగత్ యొక్క ఎస్‌యూవీని అలీబాగ్ పెన్ రోడ్డుపై వేగంగా ఒక ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. దింతో అతనితో పాటు మరో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ టీమ్ కొన్ని రోజుల తరువాత ఈ కేసును ఛేదించింది. 

ఈ కేసులో జయ, హితేష్ సహా నిందితులందరినీ అరెస్టు చేసారు. ఆరోగ్య సమస్యలతో హితేష్ 2014లో కొల్హాపూర్ ఆసుపత్రిలో మరణించారు. సురేష్ భగత్ హత్య కేసులో ఆమెకు దిగువ కోర్టు జీవిత ఖైదు విధించింది. జయ భగత్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.