బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత.. ఛాన్స్ లు లేక సుశాంత్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. తర్వాతి పరిణామాలు చూస్తుంటే.. అసలు సుశాంత్ ది ఆత్మహత్యేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు.

‘‘ ముంబయి మానవత్వాన్ని కోల్పోయింది. సుశాంత్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తీరును చూస్తుంటే ముంబయిలో జీవించడం సురక్షితం కాదు అనే భావన కలుగుతోంది.’’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

 

ముంబయి పోలీసులు.. సుశాంత్ కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదనే భావనతో ఆమె ఆ ట్వీట్ చేశారు. కాగా.. అమృత ట్వీట్ పై అధికార శివసేన పార్టీ నేతలు మండిపడ్డారు. ఆమెపై ఎదురుదాడి మొదలుపెట్టారు. అదే ముంబయి పోలీసులు గతంలో ఆమె కుటుంబానికి రక్షణగా నిలిచిన విషయం గుర్తుంచుకోవాలంటూ హితవు పలకడం గమనార్హం.

అమృత ఫడ్నవీస్ ట్వీట్ పై ఓ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలోని బీజేపీ నాయకులకు ఆమె సవాలు విసిరారు. ముంబయి పోలీసులపై నమ్మకం లేకపోతే.. వారి రక్షణ అవసరం లేదని.. ప్రైవేటు ఎజెన్సీల రక్షణ తీసుకోవాలంటూ సవాలు చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి భార్య అయ్యి ఉండి.. అమృత ఇలా మాట్లాడటం సిగ్గుచేటు అంటూ పేర్కొన్నారు.

కాగా.. అమృత చేసిన కామెంట్స్  రాజకీయంగా మరింత ఘాటు పెంచేలా కనపడుతున్నాయి. దీనిపై ఇంకెంత మంది స్పందిస్తారో చూడాల్సి ఉంది.