‘‘రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్’’ అనే సూత్రాన్ని ముంబయి అధికారులు తూచా తప్పకుండా అమలు చేశారు. సాధారణంగా సాధారణ పౌరులు రూల్స్ బ్రేక్ చేస్తే... అధికారులు జరిమానా విధిస్తుంటారు. అదే సెలబ్రెటీలు, వీఐపీ లు చేస్తే...చూసీ చూడనట్టు వ్యవహరిస్తారు. అయితే... మేము మాత్రం అలా కాదంటున్నారు ముంబయి అధికారులు. రూల్స్ పాటించలేదని నగర మేయర్ కి కూడా జరిమానా విధించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మేయర్ మహదేశ్వర్ అధికారిక కారు నో పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేశారు. దీంతో... ఆయనకు ట్రాఫిక్ అధికారులు చలానా పంపించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ప్రకటించారు.

బీఎంసీ పరిధిలో నో పార్కింగ్ ప్రదేశాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని, అయితే అలాంటి ఓ ప్రదేశంలోనే మేయర్ కారు పార్కింగ్ చేశారని అధికారి చెప్పారు.
 
మహదేశ్వర్ శివసేనకు చెందిన నేత. ఆయన వీలే పార్లేలోని కొల్డోంగారి ప్రాంతాన్ని సందర్శించడానికి ఆ సమయంలో అక్కడికి వచ్చారు. అయితే అంధేరీ రోడ్డు సమీపంలో ఉన్న ఫిష్ ఫుడ్ కోస్టల్‌ ఎదురుగా ఆపారు. అక్కడ రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నందున ‘నో పార్కింగ్‌’ జోన్‌గా ప్రకటించి సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రదేశంలో మేయర్ కారు పార్క్ చేసి ఉండడంతో ఆయనకు చలాన్ పంపించినట్లు ఓ అధికారి చెప్పారు.