ముంబై: మహారాష్ట్రలోని కుర్లాలో ఓ వ్యక్తి తన తల్లి గొంతు నులిమి చంపి శవంతో పాటు 36 గంటలు ఇంట్లోనే ఉన్నాడు. శవం త్వరగా కుళ్లిపోకూడదనే ఉద్దేశంతో ఏసీ ఆన్ చేసి పెట్టాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శవాన్ని మూడు ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. 

నిందితుడు సోహైల్ షేక్ ను పోలీసులు బుధవారంనాడు పట్టుకున్నారు. మృతురాలిని ఖైరున్నీసా షేక్ గా గుర్తించారు. ఆమె శవం డిసెంబర్ 30వ తేదీన విద్యావిహార్ లోని నావల్ గేట్ పడి ఉంది. మొకాళ్ల కింది శరీర భాగాలు కనిపించలేదు.

గొంతు నులిమి చంపిన తర్వాత తల్లిపై సుత్తితో రెండు మార్లు అతను గట్టిగా మోదాడు. దాంతో రక్తస్రావం జరిగింది. దాంతో శవాన్ని సొహైల్ బాత్రూంలోకి లాక్కెళ్లి రక్తం పూర్తిగా కారిపోయే వరకు నీళ్లు పోస్తూ వచ్చాడు. 

డిసెంబర్ 28వ తేదీ రాత్రి సొహైల్ తాగి ఇంటికి వచ్చాడు. ఉద్యోగం లేకుండా తాగి తందనాలు ఆడుతుండడంతో సొహైల్ తో తల్లి గొడవ పడింది. సొహైల్ పెళ్లి చేసుకున్నాడు. భార్యను వెళ్లగొట్టాడు. దీనికి కారణం ఏమిటనేది తెలియదు. 

రాత్రి తల్లి తలపై కొట్టిన తర్వాత పడుకున్నాడు. మర్నాడు ఉదయం మద్యం సేవిస్తూ శవాన్ని ఏం చేయాలనే ఆలోచన చేస్తూ వచ్చాడు. తల్లి చేతులకు ఉన్న రెండు బంగారు గాజులను తీసేసుకున్నాడు. వాటిని ఘట్కోపర్ లో రూ.50 వేలకు అమ్మేశాడు. అందులో 25 వేల రూపాయలు బీర్ బారులో పనిచేసే తన గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చాడు. రూ.20 వేలు చెల్లించి వడ్డీవ్యాపారి నుంచి టూవీలర్ విడిపించుకున్నాడు. 

తల్లి శవాన్ని మూడు ముక్కలు చేసి మూడు బండిల్స్ కట్టి టూవీలర్ పై పెట్టుకుని పారేశాడు. పోలీసులను తప్పు దోవ పట్టించడానికి సొహైల్ తొలుత ప్రయత్నించాడు. కానీ తర్వాత తన నేరాన్ని అంగీకరించాడు.