నిత్యం ఎన్ని మోసాలు, కుట్రలు వెలుగుచూస్తున్నా క్రిప్టో కరెన్సీపై ప్రజల తీరు మారడం లేదు. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మాటలు నమ్మి అక్షరాల రూ.1.57 కోట్లు మోసపోయాడు
క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లో (cryptocurrency investment scam) ముంబైకి (mumbai) చెందిన ఓ వ్యక్తి రూ 1.57 కోట్లు మోసపోయాడు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలోని నేపియన్ సీ నివాసి అయిన 36 ఏళ్ల వ్యక్తి క్రిప్టోకరెన్సీ మైనింగ్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక వెబ్‌సైట్ తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. బాధితుడు నిందితుడితో 2021 అక్టోబర్‌లో ఆన్‌లైన్ స్నేహం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు కొన్ని రోజుల తర్వాత క్రిప్టోకరెన్సీ మైనింగ్ గురించి బాధితుడికి చెప్పడం మొదలుపెట్టాడు. ‘యూఎస్‌డీ మైనర్’ వెబ్‌సైట్ ద్వారా క్రిప్టోకరెన్సీ మైనింగ్ హార్డ్‌వేర్‌లో పెట్టెబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని బాధితుడికి ఆశ కల్పించాడు. అలాగే ఇందులో డబ్బు సంపాదించడానికి వున్న మార్గాల గురించి కూడా చెప్పాడు.
అతని ట్రాప్‌లో పడిపోయిన బాధితుడు.. క్రిప్టో మైనింగ్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తొలుత కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగా.. బాధితుడి వ్యాలెట్‌లోకి లాభం జమ అయ్యింది. దీంతో నమ్మకం కలిగాక.. నిందితుడి సూచనల మేరకు మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అలా అక్టోబర్ 2021 నుంచి 2.83 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.53 కోట్లు) పెట్టుబడి పెట్టాడు.
అయితే ఫిర్యాదుదారుడు తన డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా.. నిందితుడు దాటవేసే ధోరణి అవలంభించేవాడు. దీంతో ఈ నెల మొదట్లో బాధితుడికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో తన డబ్బును విత్ డ్రా చేయాల్సిందిగా నిందితుడిని పలుమార్లు ఒప్పించే ప్రయత్నం చేశాడు. అతని నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో నిందితుడు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అంతేకాదు క్రిప్టో మైనింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ కూడా నకిలీదని బాధితుడు గుర్తించాడు. దీంతో వెంటనే మలబార్ హిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిధులను తరలించిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సమాచారం అందజేయాల్సిందిగా సదరు బ్యాంక్‌కు లేఖ రాశారు.
