ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వి(39) హత్యకు గురయ్యాడు. గత బుధవారంనుంచి ఆయన జాడ కనిపించలేదు. చివరకు ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఒక​ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రమోషన్‌, ప్యాకేజీ వివాదాల కారణంగానే సంఘ్వి సహోద్యోగులు కొందరు ఈ హత్యకు పాల్పడినట్టు  అనుమానిస్తున్నారు.

డిప్యూటీ కమిషనర్‌ తుషార్‌ దోషి చెప్పిన వివరాల ప్రకారం - ఈ కేసులో ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ సర్ఫరాజ్ షేక్ (20)ను అరెస్ట్‌ చేశారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడదు, మరో ముగ్గురు పేర్లను కూడా అతను వెల్లడించాడు. 

ఆ ముగ్గురు వ్యక్తులు బ్యాంకు కార్యాలయంలోని పార్కింగ్‌ ఏరియాలోనే సంఘ్విపై కత్తితో దాడి చేసి సంఘ్విని హత్య చేశారని, అనంతరం ఒక పరుపులో చుట్టి సంఘ్వి కారులోనే దాచి పెట్టారని చెప్పారు. అయితే మృతదేహాన్ని మాయం చేసేందుకు తాను అంగీకరించానని, ఇందుకు తనకు 10వేల  రూపాయలు  చెల్లించారని చెప్పాడు. 

ఈ వ్యవహారంలో ఓ మహిళ ప్రమేయంకూడా ఉందని,   కమలా మిల్స్‌ భవనంలోని పార్కింగ్‌ ఏరియాలో సీసీటీవీ లేని కారణంగా అక్కడ పలుమార్లు రెక్కీ నిర్వహించి ఈ హత్య చేశారని పోలీసుల విచారణలో షేక్‌  ఒప్పుకున్నాడు.

భార్య, నాలుగేళ్ల కుమారునితో కలిసి మలాబార్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ  బుధవారం  నుంచీ  కనిపించడం లేదు.  గత బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరిన సంఘ్వి రాత్రి పదయినా ఇంటికి తిరిగి చేరుకోలేదు.  దీంతో  అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే, సంఘ్వీ గత బుధవారం సాయంత్రం ఏడున్నర గంటలకు కమలా మిల్స్ ఆవరణలోని తన కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరినట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం నవీ ముంబై ప్రాంతంలో ఆయన కారును గుర్తించారు. కారు సీటుపై రక్తం మరకలు ఉండడమే కాకుండా ఓ కత్తి కూడా అందులో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కిడ్నాప్‌  అనుమానాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, హతుడి ఫోన్‌ లొకేషన్‌ తదితర వివరాల ఆధారంగా నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు.  వృత్తిపరమైన కక్షల కారణంగానే అతన్ని హత్య చేసినట్లు భావిస్తున్నారు.