ఒక వైపు మన దేశం సాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుపోతుంటే... మరోవైపు ఉన్నత విద్యలు అభ్యసించినవారు కూడా కులజాడ్యాన్ని వదలడం లేదు. తోటి డాక్టర్ ని కొందరు కులం పేరిట వేధించగా... ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి సెంట్రల్‌లో పాయల్‌ సల్మాన్‌ తాడ్వి అనే 23 ఏళ్ల యువతి గైనకాలజి విభాగంలో పోస్టు గ్రాడ్యూయేషన్‌ చేస్తోంది. బీవైఎస్‌ నాయర్‌ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లు తరచూ కులం పేరుతో పాయల్‌ను వేధింపులకు గురిచేసేవారు.

వేధింపులు తీవ్రస్థాయికి చేరుకోవటంతో మనస్తాపానికి గురైన పాయల్..హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేధింపులపై ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. వేధింపులకు పాల్పడిన ముగ్గురు సీనియర్‌ వైద్యులు హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.