Asianet News TeluguAsianet News Telugu

ఇదే నా చివరి గుడ్‌మార్నింగ్ కావొచ్చు: 36 గంటల తర్వాత అనంత లోకాలకు డాక్టర్

ముంబయిలో స్వెరి టీబీ ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మనీషా జాదవ్‌ (51) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్‌ చేసిన సందేశం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 

mumbai doctor dies of covid hours after farewell post on facebook ksp
Author
Mumbai, First Published Apr 21, 2021, 7:47 PM IST

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిన మనిషిని ఓ చిన్న సూక్ష్మజీవి నాలుగు గోడలకే పరిమితం చేసింది. దీని ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

వైరస్ వచ్చిందన్న ఆనందం మనిషికి లేకుండా.. తనకు తాను కొత్తగా మార్పు చెంది ఆధునిక వైద్య ప్రపంచానికే సవాల్ విసురుతోంది. అనేకమంది జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపుతూ.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. 

మందే లేని ఈ వ్యాధి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఈ మహమ్మారి దాటికి డాక్టర్లు సైతం బలవవుతున్నారు. తాజాగా ముంబయిలో స్వెరి టీబీ ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మనీషా జాదవ్‌ (51) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్‌ చేసిన సందేశం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. క్షయవ్యాధి నిపుణురాలిగా ఉన్న మనీషా ఇటీవల కొవిడ్‌ బారిన పడ్డారు. అయితే, ఓ డాక్టర్‌గా తన మరణాన్ని ముందే ఊహించిన మనీషా జాదవ్‌ ఇకపై తాను ప్రాణాలతో ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చేలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు.

Also Read:ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు: కరోనాపై కన్నీళ్లు పెట్టుకొన్న ముంబై డాక్టర్

‘ఇదే చివరి గుడ్‌ మార్నింగ్‌ కావొచ్చు. ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. మరణం శరీరానికే... ఆత్మకు కాదు, ఆత్మకు చావులేదు’’ అని మనీషా ఆదివారం ఉదయం చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని పోస్ట్‌ చేసిన 36 గంటల వ్యవధిలోనే మనీషా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.  

కాగా, దేశంలోని ఎందరో వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఈ మహమ్మారితో నెలకొంటున్న విషాదాలను తెలుపుతూ జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ముంబయికి చెందిన ఫిజీషియన్‌ డాక్టర్‌ తృప్తి గిల్డా వీడియో సందేశం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తామంతా నిస్సహాయులుగా మారిపోయామని తృప్తి కంటతడి పెట్టుకున్నారు. దేశంలో కరోనా తీవ్రంగా వున్న మహారాష్ట్రలో దాదాపు 18 వేల మందికి పైగా వైద్యులు కొవిడ్‌బారిన పడగా.. ఇప్పటి వరకు 168 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios