గే అనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లిచేసుకున్న ఓ వ్యక్తి కేసులో ముంబైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భార్యకు లక్ష రూపాయల పరిహారంతో పాటు ప్రతీనెలా.. రూ.15వేలు ఇవ్వాలని తెలిపింది. 

ముంబై : తన భర్త గే అని.. తనతో కాపురం చేయడం లేదంటూ ఓ మహిళ ముంబై కోర్టును ఆశ్రయించింది. తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపింది. అయితే అతను స్వలింగసంపర్కుడు అన్న విషయాన్ని దాచి పెట్టి తనను పెళ్ళి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు పెళ్లయిన తర్వాత అతనికి దగ్గరయ్యేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా కుదరలేదని తెలిపింది. అతనికి వేరే పురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని వాపోయింది.

తనను మోసపుచ్చి పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆ తర్వాత తనకు తన దగ్గరకు రానివ్వ లేదని…దీంతోపాటు శారీరకంగా వేధించడం చేస్తున్నాడని పేర్కొంది. తన కుటుంబాన్ని, తనను, తమ ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆమె ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు ఊరట కలిగించింది. స్వలింగ సంపర్కుడన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నందుకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

99వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి హీరాబెన్ జీవిత విశేషాలను బ్లాగ్ లో రాసిన ప్రధాని.. అందులో రాసుకొచ్చారంటే ?

దీంతోపాటు ఆమెకు ప్రతీనెలా 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆమెకు అనుకూలంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై భర్త ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసులోని సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిశీలించి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ఆమెకు అనుకూలంగానే సమర్ధించింది. అంతేకాదు కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లక్ష రూపాయలు, నెలనెలకు రూ.15వేలు తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టం చేసింది.

వీరిద్దరికీ 2016లో పెద్దలు వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఎన్ని రోజులు గడుస్తున్నా భర్త ఆమెను దగ్గరికి రానివ్వలేదు. ఆమెగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పైగా మాటలు, చేతలతో హింసించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో నిఘా వేసింది. చివరికి అతను గే అని తెలుసుకుంది. అతడి ఫోన్ లో ఇతర పురుషులతో నగ్నంగా దిగిన ఫోటోలను చూసి షాక్ అయింది. వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఆ ఫోటోలనే కోర్టులో సాక్ష్యంగా ఇచ్చింది.