సీమా హైదర్ (Seema Haider) కేసులో ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. సీమా హైదర్‌ని తిరిగి పాకిస్థాన్‌కు పంపాలని, లేకుంటే 26/11 వంటి ఉగ్రవాద దాడికి సిద్ధంగా ఉండమని బెదిరించారు.  

సీమా హైదర్‌ (Seema Haider) గతవారం రోజులుగా వార్తలో నిలుస్తున్న పేరు. పబ్‌జీ గేమ్‌ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టిన మహిళనే సీమా హైదర్‌. సరిహద్దులు దాటిన వీరి ప్రేమకథ నేడు పోలీసులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే తన భార్య (సీమా హైదర్‌) ను పాకిస్థాన్‌ పంపించాలని ఆమె భర్త భారత ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశాన్ని పంపాడు.

తాజాగా ఇదే విషయంపై ముంబయి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌లో బెదిరింపు కలకలం చేలారేగింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి .. సీమా హైదర్‌ని పాకిస్థాన్‌కు పంపించాలనీ, లేకపోతే భారత్‌ సర్వనాశనం అవుతుందని, 26/11 తరహా ఉగ్రదాడికి భారత్ సిద్ధంగా ఉండాలని ఉర్దూ భాషలో వార్నింగ్ ఇచ్చాడు. 

26/11 తరహా ఉగ్రదాడికి భారత్ సిద్ధంగా ఉండాలని, దానికి యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ప్రస్తుతం ఈ కాల్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇలాంటి కాల్స్ చాలా వచ్చాయి.మీడియా కథనాల ప్రకారం.. సీమా హైదర్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపాలని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు జూలై 12న కాల్ వచ్చింది. సీమను వెనక్కి పంపకుంటే భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధంగా ఉండాలని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ముంబై పోలీసులు, క్రైం బ్రాంచ్‌లు దీనిపై విచారణ జరుపుతున్నారు.

సీమా హైదర్ ఎవరు?

సీమా హైదర్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జైస్మాబాద్ నివాసి. ఆమెకు 2014లో గులాం రజా అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 2019లో గులాం రజా పని నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడి నుంచి అతడు సీమకు డబ్బులు పంపేవాడు. సీమ ప్రకారం.. అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆమె తన భర్తతో గొడవపడి తన పుట్టింటిలోనే ఉంటుంది. ఈ క్రమంలో అంటే.. 2020లో గ్రేటర్ నోయిడాలోని జెవార్ నివాసి అయిన సచిన్‌తో సీమా PUBG గేమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. 

వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఒక్కరితో ఒక్కరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ నేపాల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. సీమా మే 12న నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి సచిన్ ఇంటికి చేరుకుంది. స్థానికులు సమాచారం మేరకు .. అక్రమంగా సరిహద్దు దాటిన నేరం కింద సీమా హైదర్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో సచిన్‌ను కూడా నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ప్రాణాలకు ముప్పు

బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత సీమా హైదర్ మాట్లాడుతూ.. తనని పాకిస్థాన్‌కు పంపవద్దనీ, పంపితే ప్రాణహాని ఉందని వేడుకుంది. తనను భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని యోగి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తన ఇష్టపూర్వకంగానే హిందూ మతాన్ని స్వీకరించి సచిన్‌ను పెళ్లి చేసుకున్నట్లు సీమా పేర్కొంది.